YS Avinash Reddy: వైఎస్ అవినాశ్ రెడ్డికి హైకోర్టు ఇచ్చిన బెయిల్ పై విచారణ వచ్చే నెలలో చేబడతామన్న సుప్రీంకోర్టు

Supreme Court adjourns hearing of YS Avinash Reddy petition
  • పిటిషన్ ను ఫిబ్రవరిలో విచారిస్తామన్న జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం
  • గత ఏడాది మే 31న అవినాశ్ కు బెయిల్ మంజూరు చేసిన టీఎస్ హైకోర్టు
  • హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన వైఎస్ సునీత

వైఎస్ వివేకా హత్య కేసులో కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ కు సంబంధించిన పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది. ఫిబ్రవరిలో పిటిషన్ ను విచారిస్తామని తెలిపింది. గత ఏడాది మే 31న అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దీంతో, తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను జూన్ 9న వివేకా కూతురు సునీత సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ క్రమంలో జూన్ 19వ తేదీన అవినాశ్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 

ఈ పిటిషన్ పై గత ఏడాది జులై 18న, ఆ తర్వాత సెప్టెంబర్ 11న సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ కేసును లోతుగా చూడాల్సి ఉందని ధర్మాసనం పేర్కొంది. అయితే ఆ తర్వాత విచారణ జరగలేదు. ప్రతి నెల సుప్రీంకోర్టు కంప్యూటర్ జనరేటెడ్ లిస్ట్ లో కేసు విచారణ తేదీలు కనపడుతున్నప్పటికీ ఆ తర్వాత డిలీట్ అయిపోతున్నాయి. 

తాజాగా, జనవరి 16, 17, 18 తేదీల్లో విచారణకు వచ్చే అవకాశం ఉందని కంప్యూటర్ జనరేటెడ్ లిస్ట్ లో సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ పేర్కొంది. అయినప్పటికీ ఈ రోజు కూడా విచారణకు రాకపోవడంతో ఈ విషయాన్ని... వైఎస్ సునీత తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఎప్పుడు విచారిస్తారో తేదీలను వెల్లడించాలని కోరారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో పిటిషన్ ను విచారిస్తామని జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం తెలిపింది. అయితే ఏ తేదీన విచారణ చేపడతారనేది మాత్రం ధర్మాసనం వెల్లడించలేదు. ఈ సాయంత్రానికి తేదీలు తెలిసే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News