V Hanumantha Rao: దేవుడిపై అందరికీ భక్తి ఉంటుంది.. మేము కూడా అయోధ్యకు వెళతాం: వీహెచ్

We also go to Ayodhya says V Hanumantha Rao
  • మోదీ పిలిచినప్పుడే అయోధ్యకు వెళ్లాలా? అని ప్రశ్నించిన వీహెచ్
  • రాముడికి కాంగ్రెస్ వ్యతిరేకం కాదని వ్యాఖ్య
  • మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలమని విమర్శ
రాముడిని రాజకీయాల్లోకి లాగి ఓట్లను రాబట్టుకోవాలని బీజేపీ యత్నిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు విమర్శించారు. అయోధ్య రామ మందిరానికి కాంగ్రెస్ వ్యతిరేకమని బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని... రాముడికి కాంగ్రెస్ వ్యతిరేకం కాదని చెప్పారు. మోదీ పిలిచినప్పుడే అయోధ్యకు వెళ్లాలా? అని ప్రశ్నించారు. దేవుడిపై అందరికీ భక్తి ఉంటుందని... తాము కూడా వీలైనప్పుడల్లా అయోధ్య రాముడిని దర్శించుకుంటామని తెలిపారు.

25 కోట్ల మంది పేదల జీవితాలను కాంగ్రెస్ అతలాకుతలం చేసిందని మోదీ చెప్పడం విడ్డూరంగా ఉందని వీహెచ్ అన్నారు. మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. నోట్ల రద్దు తర్వాత చిరు వ్యాపారులు రోడ్డున పడ్డారని అన్నారు. మద్దతు ధర పెంచాలనే రైతుల డిమాండ్ ను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను వీహెచ్ కలిసి పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు. మరోవైపు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఈరోజు తమ్మినేనిని పరామర్శించారు. 
V Hanumantha Rao
Congress
Narendra Modi
BJP
Ayodhya Ram Mandir

More Telugu News