Hyderabad Power Cuts: సంక్రాంతి తర్వాత నుంచి హైదరాబాద్‌లో రెండుగంటల విద్యుత్ కోతలు.. కారణం ఇదేనట!

Hyderabadis In For Two Hour Power Cuts
  • నిర్వహణ పనుల్లో భాగమేనన్న టీఎస్ఎస్‌పీడీసీఎల్
  • వార్షిక నిర్వహణ పనుల్లో భాగంగానేనన్న సంస్థ ఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ
  • రోజువారీ పవర్ కట్స్ కాదని స్పష్టీకరణ
  • అసౌకర్యానికి చింతిస్తున్నామన్న ఫారూఖీ

హైదరాబాద్‌లో విద్యుత్ కోతలకు దక్షిణ మండల విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్‌పీడీసీఎల్) సిద్ధమవుతోంది. సంక్రాంతి తర్వాత విద్యుత్ కోతలు ఉండే అవకాశం ఉందని ఆ సంస్థ ఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ తెలిపారు. వార్షిక నిర్వహణ పనుల్లో భాగంగానే ఈ కోతలని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు కలిగే అసౌకర్యానికి చింతిస్తున్నామని, జీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో పవర్ కట్స్ ఉంటాయని పేర్కొన్నారు.

రబీ సీజన్ డిమాండ్‌ను ఎదుర్కొనేందుకే
సమ్మర్/రబీ సీజన్‌లో ఉండే విద్యుత్ డిమాండ్‌కు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో రోజుకు రెండు గంటల కోతలు అవసరం పడొచ్చని వివరించారు. సంక్రాంతి తర్వాత కోతలు ఉంటాయని స్పష్టం చేశారు. అయితే, నిర్వహణ పనులు జరిగే ప్రాంతాల్లో మాత్రమే పవర్ కట్స్ ఉంటాయని ఎక్స్‌ (ట్విట్టర్) వినియోగదారుల ప్రశ్నలకు బదులిస్తూ  పేర్కొన్నారు.

ఒక్కో ఫీడర్‌లో ఒక్కో రోజు మాత్రమే
మెయింటెనెన్స్ పనుల్లో భాగంగా విద్యుత్ తీగలపైకి పెరిగిన చెట్లకొమ్మలు తొలగించడం, విద్యుత్ లైన్లను సరిచూసుకోవడం, అవసరమైతే కొత్తవాటిని వేయడం వంటివి ఉంటాయని ముషారఫ్ తెలిపారు. పవర్ కట్స్ ఉంటాయని చెప్పినంత మాత్రం రోజువారీ ఉండవని, ఒక్కో ఫీడర్‌లో ఒక్కో రోజు మాత్రమే ఉంటాయని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 3 వేల ఫీడర్లు ఉన్నాయని, ఆయా ఫీడర్ల పరిధిలో రెండు గంటల కోతలు ఉంటాయని తెలిపారు. సమ్మర్ డిమాండ్‌ను తట్టుకునేందుకు ప్రతి సంవత్సరం నవంబర్-జనవరి మధ్య వార్షిక నిర్వహణ పనులు ఉంటాయని, కానీ ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఇవి ఆలస్యమైనట్టు ఫారూఖీ వివరించారు.

  • Loading...

More Telugu News