సడెన్‌గా గ్రౌండ్‌లోకి దూసుకొచ్చి కోహ్లీని కౌగిలించుకున్న వీరాభిమాని.. అదుపులోకి తీసుకున్న పోలీసులు
- ఇండోర్ వేదికగా ఆఫ్ఘనిస్థాన్‌పై ఆదివారం రాత్రి జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో చోటుచేసుకున్న ఘటన
- భద్రతా నిబంధనలను ఉల్లంఘించడంతో యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- విచారణ ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని స్పష్టం చేసిన ఇండోర్ పోలీసులు
సదరు యువకుడి దగ్గర మ్యాచ్ టికెట్ ఉందని తెలిపారు. నరేంద్ర హిర్వానీ గేట్ నుంచి మైదానంలోకి ప్రవేశించాడని ఓ పోలీసు అధికారి తెలిపారు. ఆ యువకుడు కోహ్లీకి వీరాభిమానిలా కనిపిస్తున్నాడని, ఎలాగైనా కలవాలనే కోరికతోనే ప్రేక్షకుల గ్యాలరీ నుంచి కంచె దాటి మైదానంలోకి ప్రవేశించాడని తెలిపారు. ఈ ఘటనపై యువకుడిని విచారిస్తున్నట్టు తెలిపారు. విచారణ ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఇదిలావుంచితే కోహ్లీని ఫ్యాన్ కౌగిలించుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కాగా 14 నెలల తర్వాత తొలి టీ20 మ్యాచ్ ఆడిన కోహ్లీ దూకుడుగా ఆడాడు. లక్ష్యం చిన్నది కావడంతో షాట్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 15 బంతులు ఎదుర్కొని 181.25 స్ట్రైక్ రేట్‌తో 29 పరుగులు నమోదు చేశాడు. ఇందులో 5 ఫోర్లు ఉన్నాయి. కాగా ఇండోర్ టీ20 మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై టీమిండియా ఘనవిజయం సాధించింది. దీంతో 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-0 తేడాతో భారత్ గెలుచుకుంది.