Ambati Rambabu: మళ్లీ డ్యాన్స్ చేసిన అంబటి రాంబాబు.. భోగి వేడుకల్లో జోరుగా, హూషారుగా స్టెప్పులు.. వీడియో ఇదిగో!

Ambati Rambabu again dances for Bhogi celebrations
  • సత్తెనపల్లిలో నిర్వహించిన భోగి వేడుకల్లో ఉత్సాహంగా డ్యాన్స్ చేసిన వైసీపీ నేత
  • డప్పు చప్పుళ్లు, పాటలకు లయబద్ధంగా నృత్యమాడిన అంబటి
  • సంక్రాంతికి సంబరాల రాంబాబునేనని స్పష్టం చేసిన మాజీ మంత్రి
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. ఉద్యోగ, ఉపాధి, విద్య కోసం వేర్వేరు ప్రాంతాల్లో నివసించే వారంతా సొంతూళ్లకు చేరుకోవడంతో గ్రామాలన్నీ కళకళ్లాడుతున్నాయి. భోగి సందర్భంగా ఆదివారం ఉదయం ఎక్కడ చూసినా సాంప్రదాయక కార్యక్రమాలు కనిపించాయి. ఎక్కడ చూసినా భోగి మంటల కోలాహలం కనిపించింది. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా సరదాగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సత్తెనపల్లి పట్టణంలో వైఎస్సార్‌సీపీ కీలక నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గతేడాది మాదిరిగానే ఉత్సాహంగా కనిపించారు. భోగి సందర్భంగా పట్టణంలో ఆదివారం నిర్వహించిన భోగి వేడుకల్లో ఆయన డ్యాన్స్ చేశారు. జోరుగా, హుషారుగా స్టెప్పులు వేసి ఆకర్షించారు. డప్పు చప్పుళ్లకు లయబద్ధంగా డ్యాన్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరైన వారంతా చప్పట్లతో అంబటి రాంబాబును ఉత్సాహపరిచారు.

సంక్రాంతికి సంబరాలు రాంబాబునే: అంబటి రాంబాబు
గతేడాది సంక్రాంతి వేడుకల్లో అంబటి రాంబాబు సరదాగా చేసిన డ్యాన్స్‌‌ చిన్నపాటి చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. అంబటి డ్యాన్స్‌ను పవన్ కల్యాణ్ నటించిన ‘బ్రో’ సినిమాలో పేరడీగా తీసుకోవడం, సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం హాట్‌ హాట్ చర్చకు దారితీసింది. అయితే గతాన్ని పక్కన పెట్టి ఈ ఏడాది కూడా జోరుగా డ్యాన్స్ చేయడంపై అంబటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతికి తాను సంబరాల రాంబాబునేనని ఆయన అన్నారు. లేనిపోని రాద్దాంతాలను తాను పట్టించుకోబోనని ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ అన్నారు. సినిమాల్లో కూడా చూపిస్తున్నారు కదా అని ప్రశ్నించగా... ‘‘ సినిమాల్లో పెట్టుకునే స్థాయిలో నన్ను లేపుతుంటే నేనెందుకు కాదంటాను. నాకేం సమస్యా లేదు. ఇంకో రెండు మూడు పాటలకు డ్యాన్స్ చేస్తా’’ అని వ్యాఖ్యానించారు. ఇదిలావుంచితే ఈ ఏడాది భోగి మంటల వేడుకల సాక్షిగా ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను చేపట్టాలని విపక్ష టీడీపీ, జనసేన పార్టీలు తమ శ్రేణులకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
Ambati Rambabu
Ambati Rambabu Dance
Sankranti
Bhogi celebrations

More Telugu News