Canada Immigration: కెనడాలో విదేశీ విద్యార్థులపై ఆంక్షలు? పరిస్థితి అదుపు తప్పిందన్న ఇమిగ్రేషన్ మంత్రి

Canada Plans Cap On Foreign Students Amid Housing Crisis
  • విదేశీ విద్యార్థుల రాకపై ఆంక్షలు విధించే యోచనలో కెనడా ప్రభుత్వం
  • నిరుద్యోగిత, ఇళ్ల కొరతతో కెనడా సతమతం
  • విదేశీయుల రాకను ప్రోత్సహిస్తోందంటూ ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్న విమర్శలు
విదేశీ విద్యార్థులను రెడ్ కార్పెట్ పరిచి మరీ స్వాగతం పలికే కెనడా ప్రస్తుతం వారి రాకపై ఆంక్షలు విధించే అంశాన్ని పరిశీలిస్తోంది. దేశంలో నానాటికీ పెరిగిపోతున్న నిరుద్యోగిత, ఇళ్ల కొరత వంటి సమస్యలు సంక్షోభ స్థాయికి చేరుకుంటుండటంతో వలసలకు బ్రేకులు వేసేందుకు రెడీ అవుతోంది. ఈ విషయాన్ని కెనడా ఇమిగ్రేషన్ శాఖ మంత్రి మార్క్ మిల్లర్ స్వయంగా వెల్లడించారు. 

కెనడాలోకి వలసలు భారీగా పెరిగిపోయాయని మంత్రి మార్క్ మిల్లర్ ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితి అదుపుతప్పిందని వ్యాఖ్యానించారు. విదేశీ విద్యార్థుల రాకపై పరిమితి విధించే అంశాన్ని ఆలోచిస్తున్నామని అన్నారు. వచ్చే రెండు త్రైమాసికాల్లో ఇళ్లకు డిమాండ్ తగ్గించే విధంగా వలసలపై పరిమితులు విధించే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. 

కొన్ని నెలలుగా ఆంక్షల అంశాన్ని పరిశీలిస్తున్న కెనడా ప్రభుత్వం తాజాగా వాటి అమలుకు సమాయత్తమవుతోంది.  ఈ వ్యవహారంపై కూడా మంత్రి క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రాల వారీగా వలసల స్థాయిలను సమీక్షించడంతో పాటు జాతీయ స్థాయిలోనూ వీటిని పరిశీలించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. కొన్ని రాష్ట్రాల్లో విద్యాసంస్థలు భారీగా విదేశీ విద్యార్థులకు అడ్మిషన్లు ఇస్తూ లాభపడుతున్నాయని వ్యాఖ్యానించారు. అయితే, సందర్భానుసారంగా పరిమితులు, ఆంక్షల్లో మార్పులు ఉంటాయని భరోసా ఇచ్చారు. అందరినీ ఒకేగాటన కట్టడం చేయమని వివరించారు. 

కెనడాలో ఇళ్ల లభ్యత కంటే విదేశీ విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండటంపై కూడా ఆయన స్పందించారు. ఈ  మొత్తం వ్యవహారంలో ఇళ్ల లభ్యత ఓ అంశం మాత్రమేనని పేర్కొన్నారు. విదేశీ వర్కర్స్ సగటు వయసు తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వ చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. 

కాగా, దేశంలోకి వలసలను ప్రోత్సహిస్తూ ఇళ్ల కొరతకు కారణమవుతున్న కెనడా ప్రభుత్వంపై ఇటీవల కాలంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాత్కాలిక, శాశ్వత నివాసార్హతతో అనేక మంది విదేశీయులు కెనడాలో కాలుపెట్టడం వివాదానికి కారణమవుతోంది. కాగా, ఈ ఏడాది వలసలను 4.85 లక్షలకు పరిమితం చేయాలని ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది. వచ్చే రెండేళ్లల్లో ఏటా 5 లక్షల మంది విదేశీయుల చొప్పున దేశంలోకి అనుమతించాలని నిర్ణయించింది. తాత్కాలిక ప్రాతిపదికన కెనడా వచ్చే వారిలో విదేశీ విద్యార్థులు, వలస కార్మికులు అధిక సంఖ్యలో ఉన్నారు. గతేడాది మూడో త్రైమాసికంలో సుమారు మూడు లక్షల మంది విదేశీయులు కెనడాలో తాత్కాలిక నివాసార్హత పొందారు.
Canada Immigration
International Students
Justin Trudeau
India

More Telugu News