JP Nadda: I.N.D.I.A. కూటమిపై జేపీ నడ్డా తీవ్ర విమర్శలు

  • కుటుంబాలను, ఆస్తులను కాపాడుకోవడమే ఆ కూటమి అజెండా అని విమర్శ
  • యువత, రైతులు, మహిళా సాధికారత కోసం మోదీ తపిస్తున్నారన్న నడ్డా
  • ప్రతిపక్షాలది వర్చువల్ కూటమి అని ఎద్దేవా
JP Nadda takes a dig at INDIA bloc huddle

ప్రతిపక్ష కూటమి I.N.D.I.A.పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శనివారం విమర్శలు గుప్పించారు. అదో వర్చువల్ కూటమి అని ఎద్దేవా చేశారు. ఈ కూటమి వారి కుటుంబాలను, ఆస్తులను కాపాడుకోవడమే అజెండగా పని చేస్తుందని మండిపడ్డారు. శనివారం ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ... అభివృద్ధి భారత్ కోసం ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారన్నారు. యువత, రైతులు, మహిళా సాధికారత కోసం తపిస్తున్నారన్నారు. పేదరికాన్ని నిర్మూలిస్తున్నారని పేర్కొన్నారు. కానీ ప్రతిపక్షం మాత్రం దేశం కోసం తపించే మోదీని తొలగించాలని చూస్తోందన్నారు.

ప్రతిపక్ష కూటమి పార్టీలు వర్చువల్‌గా సమావేశమవుతున్నట్లు తెలిసిందని... ఒక వర్చువల్ కూటమి వర్చువల్ సమావేశాలు మాత్రమే నిర్వహిస్తోందని ఎద్దేవా చేశారు. కరుణానిధి, ప్రకాశ్ సింగ్ బాదల్ వంటి వారు ఎప్పుడూ తమ పిల్లల రాజకీయ భవిష్యత్తు గురించి ఆందోళన చెందేవారని... ఇప్పుడు మమతా బెనర్జీ, శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా, ఎంకే స్టాలిన్ పరిస్థితీ అదే అన్నారు. అఖిలేశ్ యాదవ్ బాధ అంతా తన భార్య డింపుల్ యాదవ్ రాజకీయ భవిష్యత్తుపై లేదా? అని చురక అంటించారు. వీరంతా అవినీతి, అక్రమాలకు పాల్పడి సీబీఐ, ఈడీ కేసులు ఎదుర్కొంటున్నారని... కానీ దర్యాఫ్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని తిరిగి తమపైనే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు బెయిల్ పై బయట ఉన్నారని గుర్తు చేశారు. సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ అంటూ మోదీ మాత్రం రాజకీయాలకు కొత్త నిర్వచనం చెప్పారన్నారు. గత ప్రభుత్వాలు మతం, కులం పేరుతో విభజించి పాలించాయని... మోదీ మాత్రం సంప్రదాయ విధానాన్ని మార్చారన్నారు. పేదలు, యువత, రైతులు, మహిళలను నాలుగు పెద్ద కులాలుగా ప్రధాని గుర్తించారన్నారు. ఓబీసీల కోసం మోదీ ఎంతో కృషి చేశారన్నారు. ప్రతిపక్షాలకు కాషాయ భయం పట్టుకుందన్నారు. ప్రజలంతా మంచి, చెడులను గుర్తించాలని కోరారు.

ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్, ఇతర సంస్థల సంఖ్య పెరగడాన్ని నడ్డా ఉదహరిస్తూ... యువతకు అవకాశాలకు సంబంధించినంత వరకు మోదీ ప్రభుత్వంలో దేశం పరివర్తన చెందిందన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవమైన జనవరి 25 నాటికి తమ సభ్యులను ఉద్దేశించి మోదీ ప్రసంగించే నాటికి కోటి మంది కొత్త ఓటర్లను నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

More Telugu News