YS Sharmila: చంద్రబాబును కలిసిన తర్వాత వైఎస్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు!

YS Sharmila interesting comments after meeting with Chandrababu
  • రాజశేఖరరెడ్డి గురించే చంద్రబాబు ఎక్కువగా మాట్లాడారన్న షర్మిల
  • వైఎస్ తో ఆయనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారని వెల్లడి
  • చంద్రబాబును కలవడాన్ని రాజకీయంగా చూడొద్దని సూచన
  • చంద్రబాబుతో మాట్లాడటం సంతోషంగా అనిపించిందని వ్యాఖ్య
  • ప్రజలకు సేవ చేయడానికే అందరం ఉన్నామన్న షర్మిల
టీడీపీ అధినేత చంద్రబాబును తన కుమారుడి వివాహానికి షర్మిల ఆహ్వానించారు. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన షర్మిల... కుమారుడు రాజారెడ్డి పెళ్లికి చంద్రబాబు కుటుంబాన్ని ఆహ్వానించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

"వైఎస్ రాజశేఖరరెడ్డి గారి మనవడు రాజా రెడ్డి పెళ్లి జరుగుతున్న తరుణంలో చాలా మంది రాజకీయ నాయకులను పెళ్లికి ఆహ్వానిస్తున్నాం. ఇందులో భాగంగానే చంద్రబాబు గారిని కూడా పెళ్లికి వచ్చి వధూవరులను ఆశీర్వదించాలని కోరడం జరిగింది. చాలాసేపు రాజశేఖరరెడ్డి గురించి, వారి స్నేహం గురించి, వారి రాజకీయ ప్రారంభ దశలో జరిగిన ప్రస్థానం గురించి చంద్రబాబు అన్నీ గుర్తు చేసుకున్నారు. నాకు గుర్తు చేశారు. ఇద్దరం చాలా సేపు మాట్లాడాం. చాలా సంతోషం అనిపించింది. 

పెళ్లికి వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదిస్తానని మాట ఇచ్చారు. మా మధ్య చర్చలో ఎక్కువగా రాజశేఖరరెడ్డి గురించే ప్రస్తావించారు. ఇద్దరి ప్రయాణం, జీపులో కలిసి తిరగడం, పొద్దున్నుంచి రాత్రి వరకు కలిసి ఉండటం, ఇద్దరూ ఢిల్లీకి కలిసి వెళ్లడం, సీఎం పదవి కోసం ఇద్దరూ చేసిన ప్రయత్నాలు.. ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వచ్చారు. 

లోకేశ్ నా గురించి చేసిన ట్వీట్ ను రాజకీయంగా చూడకండి. చంద్రబాబు గారికి ఒక క్రిస్మస్ కేక్ మాత్రమే పంపడం జరిగింది. ఆ కేక్ కేవలం చంద్రబాబుకు మాత్రమే పంపలేదు. కేటీఆర్, కవిత, హరీశ్ రావు వంటి వారికి కూడా పంపించాం. రాజకీయాలే జీవితం కాదు. రాజకీయం ఒక ప్రొఫెషన్. రాజకీయ ప్రత్యర్థులుగా ఒక మాట అనుకోవడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో కేక్ పంపిస్తే అందరి మధ్య మంచి అనుబంధం నెలకొంటుంది. 

చంద్రబాబును కలవడాన్ని రాజకీయంగా చూడొద్దు. రాజశేఖరరెడ్డి కూడా తన సొంత పిల్లల పెళ్లిళ్లకు చంద్రబాబును పిలిచారు. చంద్రబాబు కూడా రావడం జరిగింది. మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. అందరం ప్రజలకు సేవ చేయడానికే ఉన్నాం. అందరూ ఫ్రెండ్లీగా ఉండాలి. ప్రజల కోసం అందరం నమ్మకంగా పని చేద్దాం. నాకు ఏ పదవి ఇవ్వాలనేది కాంగ్రెస్ నాయకత్వం చూసుకుంటుంది. రాహుల్ ప్రధాని కావాలని రాజశేఖర్ రెడ్డి ఆకాంక్షించారు" అని చెప్పారు.
YS Sharmila
Congress
Chandrababu
Telugudesam
Nara Lokesh
YS Rajasekhar Reddy

More Telugu News