Kodandaram: రేవంత్ రెడ్డిపై ప్రొఫెసర్ కోదండరాం ప్రశంసలు

  • రేవంత్ రెడ్డి ప్రజలతో కలిసిపోయి పని చేస్తున్నారని కితాబు
  • బీఆర్ఎస్ పాలనలో ఆంక్షలు, భయం చూశామన్న కోదండరాం
  • నాలుగో తేదీనే వేతనాలు వచ్చినందుకు ఉద్యోగులు సంతోషంగా ఉన్నట్లు వెల్లడి
  • తెలంగాణలో నియంతృత్వాన్ని ఓడించాలని పోరాటం చేశామన్న కోదండరాం
Kodandaram praises CM Revanth Reddy

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ప్రశంసలు కురిపించారు. అదే సమయంలో గత కేసీఆర్ పాలనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రేవంత్ రెడ్డి ప్రజలతో కలిసిపోయి పని చేస్తున్నారని కితాబునిచ్చారు. ఢిల్లీలోను ఇలా మార్పు రావాలని కోరుకుంటున్నట్టు ఆయన చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో ఆంక్షలు.. భయం చూశామని... ఇప్పుడు తల మీది నుంచి భారం తగ్గినట్లుగా ఉందన్నారు. ఇప్పుడు ఫోన్లు కూడా స్వేచ్ఛగా మాట్లాడుకోగలుతున్నామన్నారు. నాలుగో తేదీన వేతనాలు వచ్చినందుకు ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. 

గత ప్రభుత్వం నిరసన వ్యక్తం చేసిన వారిపై కేసులు పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియంతృత్వాన్ని ఓడించాలని తాము పోరాటం చేసి.. సఫలమయ్యామన్నారు. నియంత పోకడలే బీఆర్ఎస్ అధికారం కోల్పోవడానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. రాజకీయ ఉద్దేశ్యంతో పెట్టిన కేసులను ఎత్తివేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. 

తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రధాని మోదీ తప్పుపట్టారని... దానిని తాము ఖండిస్తున్నామన్నారు. బయ్యారం ఉక్కు పరిశ్రమపై ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదన్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే కాజీపేట రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారని విమర్శించారు. విభజన హామీలపై కేంద్రం జాప్యం చేస్తోందని ఆరోపించారు. తెలంగాణపై కేంద్రం నిర్లక్ష్యం వహిస్తోందని.. దీనిపై సదస్సు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఈ నెల 21న సదస్సు నిర్వహిస్తామన్నారు. భద్రాచలం రాములవారి ఆలయానికి భద్రత లేకుండా పోయిందన్నారు.

More Telugu News