Rohit Sharma: రోహిత్ శర్మ ఖాతాలో అవాంఛిత రికార్డు.. ఇండియన్ క్రికెట్ హిస్టరీలో ఇదే తొలిసారి

Rohit Sharma got Unwanted record in the history of Indian cricket
  • టీ20 ఫార్మాట్‌లో సున్నా పరుగుల వద్ద రనౌట్‌గా వెనుతిరిగిన తొలి భారతీయ కెప్టెన్‌గా నిలిచిన హిట్‌మ్యాన్
  • మొహాలిలో ఆఫ్ఘనిస్థాన్‌పై గెలుపుతో 100 టీ20 విజయాలు అందుకున్నప్పటికీ రోహిత్ ఖాతాలో అవాంఛిత రికార్డు
  • టీ20 కెరీర్‌లో మొత్తం 11 సార్లు డకౌట్ అయిన టీమిండియా కెప్టెన్
దాదాపు 14 నెలల సుదీర్ఘ విరామం తర్వాత టీ20 ఫార్మాట్ క్రికెట్ ఆడిన కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట అవాంఛిత రికార్డు నమోదయింది. గురువారం రాత్రి ఆఫ్ఘనిస్థాన్‌పై మ్యాచ్‌లో అనూహ్య రీతిలో సున్నా పరుగుల వద్ద రనౌట్‌గా వెనుతిరిగిన రోహిత్  శర్మ.. టీ20 ఫార్మాట్‌లో రనౌట్‌ అయ్యిన తొలి భారతీయ కెప్టెన్‌గా నిలిచాడు. పొట్టి క్రికెట్ ఫార్మాట్‌లో ఓ ఇండియన్ కెప్టెన్ ఈ రీతిలో ఔటవ్వడం ఇదే తొలిసారి. అంతకుముందు కెప్టెన్లు ఎవరూ సున్నా పరుగుల వద్ద రనౌట్ కాలేదు. దీంతో హిట్‌మ్యాన్ పేరిట ఈ అవాంఛిత రికార్డు నమోదయ్యింది. అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్ కంటే ముందు 8 మంది కెప్టెన్లు రనౌట్ అయ్యారు. కాగా టీ20 ఫార్మాట్‌లో రోహిత్ శర్మకు ఇది 11వ డకౌట్ కావడం గమనార్హం. మొహాలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై గెలుపుతో 100 టీ20 విజయాలు అందుకున్న తొలి అంతర్జాతీయ ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచినప్పటికీ ఈ అవాంఛిత రికార్డును తన ఖాతాలో వేసుకోవాల్సి వచ్చింది.

టీ20 ఫార్మాట్‌లో సున్నా పరుగులకే రనౌట్ అయ్యిన కెప్టెన్లు వీళ్లే..
శ్రీలంక క్రికెట్ దిగ్గజం మహేల జయవర్ధనే 2 సార్లు డకౌట్ అయ్యి తొలిస్థానంలో నిలిచాడు. ఇక అస్గర్ ఆఫ్ఘన్ (ఆఫ్ఘనిస్థాన్) - ఒకసారి, బాబర్ ఆజం (పాకిస్థాన్) - ఒకసారి, స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లండ్) - ఒకసారి, చిగుంబుర (జింబాబ్వే) - ఒకసారి, పాల్ కాలింగ్‌వుడ్ (ఇంగ్లండ్ - ఒకసారి, షాహిద్ అఫ్రీది (పాకిస్థాన్) - ఒకసారి, డేనియల్ వెట్టోరి - ఒకసారి, రోహిత్ శర్మ (ఇండియా) - ఒకసారి ఔటయ్యారు.

ఇదిలావుంచితే టీ20 ఫార్మాట్‌లో రనౌట్‌గా వెనుతిరిగిన 11వ భారతీయ ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. హిట్‌మ్యాన్ కంటే ముందు అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, పీయూష్ చావ్లా, రుతురాజ్ గైక్వాడ్, అమిత్ మిశ్రా, మహ్మద్ షమీ, మనీష్ పాండే, రవి బిష్ణోయ్, అంబటి రాయుడు, వీరేంద్ర సెహ్వాగ్‌లు రనౌట్‌గా ఔట్ అయ్యారు. మొహాలిలో ఆఫ్ఘనిస్థాన్‌పై షాకింగ్ రీతిలో రనౌట్ అయ్యిన రోహిత్ శర్మ.. శుభ్‌మాన్ ‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Rohit Sharma
Run out
India vs Afghanistan
Cricket
Team India

More Telugu News