EaseMy Trip: మాల్దీవులు-ఇండియా వివాదం నేపథ్యంలో ‘ఈజ్ మై ట్రిప్’ కీలక ప్రకటన

EaseMy Trip announced key statement in the wake of the Maldives India dispute
  • ‘నేషన్ ఫస్ట్, బిజినెస్ లేటర్' అని పునరుద్ఘాటించిన ట్రావెల్ కంపెనీ
  • భారత్, దేశ పౌరులు, ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా బుకింగ్స్ నిలిపివేశామని వెల్లడి
  • సుందరమైన భారతీయ బీచ్‌ల పట్ల గర్విస్తున్నామంటూ ప్రకటన విడుదల చేసిన ట్రావెల్ కంపెనీ
మాల్దీవులు - భారత్ మధ్య వివాదం నేపథ్యంలో ఇండియన్ ట్రావెల్ కంపెనీ ‘ఈజ్ మై ట్రిప్’ కీలకమైన ప్రకటన విడుదల చేసింది. దేశ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యమని, ఆ తర్వాతే వ్యాపారమని తేల్చి చెప్పింది. ఈ మేరకు ‘నేషన్ ఫస్ట్, బిజినెస్ లేటర్' అనే పేరిట కీలక ప్రకటన చేసింది. భారత్‌లో ఉన్న అద్భుతమైన బీచ్‌ల పట్ల తాము గర్వపడుతున్నామని వ్యాఖ్యానించింది. దేశంలో లక్షద్వీప్, అండమాన్, గోవా, కేరళ సహా అద్భుతమైన బీచ్ అందాలు ఉన్నాయని, దేశంలో 7,500 కిలోమీటర్ల విస్తారమైన తీరప్రాంతం ఉందని ‘ఈజ్ మై ట్రిప్’ పేర్కొంది. 

భారతదేశం, దేశ పౌరులు, గౌరవనీయులైన ప్రధాన మంత్రికి వ్యతిరేకంగా మాల్దీవుల మంత్రులు ఇటీవల చేసిన అనుచితమైన, అసంబద్ధమైన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. జనవరి 8 నుంచి మాల్దీవులకు అన్ని ప్రయాణ బుకింగ్‌లను తాత్కాలికంగా నిలిపివేశామని తెలిపింది. సొంత లాభాల కంటే దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తామని పునరుద్ఘాటించింది. సోషల్ మీడియా వేదికగా లభిస్తున్న మద్దతు దేశం పట్ల ప్రేమాభిమానాలకు ప్రతిబింబమని ఆనందం వ్యక్తం చేసింది. ఈ ప్రయాణంలో అంతా ఐక్యంగా ఉందామంటూ ‘ఈజ్ మై ట్రిప్’ పిలుపునిచ్చింది.

కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్‌ను సందర్శించారు. అక్కడి అందమైన బీచ్‌లలో సేదతీశారు. అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి లక్షద్వీప్‌లో పర్యటించాలంటూ దేశ ప్రజలకు సందేశం ఇచ్చారు. అయితే ప్రధాని మోదీ ప్రకటనతో మాల్దీవులకు చెందిన పలువురు మంత్రులు అక్కసు వెళ్లగక్కారు. లక్షద్వీప్ బీచ్‌లు రోతగా ఉంటాయని హేళన చేశారు. అక్కడితో ఆగకుండా ఇజ్రాయెల్‌తో ముడిపెట్టి ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో మాల్దీవులపై భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటల వ్యవధిలోనే చాలా మంది తమ మాల్దీవుల ట్రిప్‌ను రద్దు చేసుకున్నారు. సోషల్ మీడియా వేదికగా బాయ్‌కాట్ మాల్దీవులు ప్రచారాన్ని హోరెత్తించారు. లక్షద్వీప్‌లో పర్యటించాలని పోస్టులు పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘ఈజ్ మై ట్రిప్’ మాల్దీవుల సందర్శనకు సంబంధించిన అన్ని రకాల బుకింగ్స్‌ను నిలిపివేసింది.
EaseMy Trip
Maldives India dispute
Lakshadweep
Narendra Modi
India

More Telugu News