Death penalty: నైట్రోజన్ గ్యాస్‌తో మరణశిక్ష.. మొట్టమొదటిసారి అనుమతినిచ్చిన యూఎస్ జడ్జి

Death penalty by nitrogen gas to be held First time in USA
  • 1988లో కిరాయి హత్యకు పాల్పడ్డ కెన్నెత్ అనే వ్యక్తికి ఈ నెల 25న మరణదండన
  • నైట్రోజన్ గ్యాస్ పద్ధతిలో మరణశిక్షను వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చిన న్యాయస్థానం
  • ప్రాణాంతక ఇంజెక్షన్లు లభించకపోవడంతో కొత్త పద్ధతిలో మరణశిక్ష విధించనున్న అలబామా రాష్ట్రం

అగ్రరాజ్యం అమెరికాలో మొట్టమొదటిసారి నైట్రోజన్ గ్యాస్‌‌ను పీల్పించడం ద్వారా మరణశిక్షను అమలు చేయబోతున్నారు. ఈ మేరకు అలబామా రాష్ట్ర అధికారులకు యూఎస్ ఫెడరల్ జడ్జి అనుమతి నిచ్చారు. 1988లో కిరాయి హత్యకు పాల్పడిన కెన్నెత్ స్మిత్ అనే వ్యక్తికి ఈ విధానంలో మరణదండన విధించనున్నారు. జనవరి 25న అలబామాలో శిక్షను అమలుచేయనున్నారు. అయితే నైట్రోజన్ గ్యాస్ ద్వారా మరణశిక్ష విధించడాన్ని సవాలు చేస్తూ దోషి కెన్నెత్ స్మిత్ కోర్టులో పిటిషన్ వేయగా దానిని ఫెడరల్ జడ్జి తోసిపుచ్చారు. 

ప్రతిపాదిత పద్ధతిలో మరణశిక్ష ప్రమాదకరమైనదని, ముఖానికి ధరించే మాస్క్ పగిలిపోయి ఆక్సిజన్ లోపలికి వస్తే శరీర భాగాలు దెబ్బతిని దీర్ఘకాలంపాటు అచేతనంగా పడి ఉండాల్సి ఉంటుందని అభ్యంతరం తెలిపాడు. ఈ మేరకు అలబామా డిపార్ట్‌మెంట్ ఆఫ్ కరెక్షన్స్‌పై కెన్నెత్ దావా వేయగా జడ్జి కొట్టివేశారు. నైట్రోజన్ గ్యాస్ ద్వారా మరణశిక్షను కొనసాగించవచ్చునని అలబామాలోని మోంట్‌గోమెరీ యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జి ఆర్ ఆస్టిన్ బుధవారం ఈ తీర్పు ఇచ్చారు. ఈ పద్ధతి క్రూరమైనదని, అసాధారణమైన శిక్ష అని ఖైదీ చెప్పలేరని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.  

కాగా ఈ పద్ధతిలో ఖైదీ ముఖానికి మాస్క్‌ని కట్టి నైట్రోజన్ గ్యాస్‌ని వదులుతారు. ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోవాల్సి ఉంటుంది. ఇదిలావుంచితే.. అమెరికా రాష్ట్రాలు మరణశిక్షలో ఉపయోగించే ప్రాణాంతక లెథల్ ఇంజెక్షన్‌లను ప్రొటోకాల్ ప్రకారం పొందడం చాలా సంక్లిష్టంగా మారింది. మరణశిక్షల్లో వాడే ఔషధాలను విక్రయించొద్దని కంపెనీలపై యూరోపియన్ యూనియన్ నిషేధం విధించడం ఇందుకు కారణమైంది. దీంతో అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు ఫైరింగ్ స్క్వాడ్‌ వంటి పాత పద్ధతులను పునరుద్ధరించాలని నిర్ణయించాయి. ఇక అలబామా, మిస్సిసిప్పి, ఓక్లహామా రాష్ట్రాలు కొత్త గ్యాస్ ఆధారిత విధానాన్ని ప్రవేశపెట్టాయి. కాగా జడ వాయువు ద్వారా ఊపిరాడకుండా చేసి మరణశిక్ష విధించడం హింస అని, క్రూరమైన అమానవీయమైన శిక్ష అని ఐక్యరాజ్యసమితి నిపుణులు గత వారమే హెచ్చరించారు.

  • Loading...

More Telugu News