Chandrababu: కోడిగుడ్డు మంత్రికి సీటు ఇవ్వలేకపోయావు!: బొబ్బిలి సభలో చంద్రబాబు వ్యాఖ్యలు

  • విజయనగరం జిల్లా బొబ్బలిలో రా కదలిరా సభ
  • వాడీవేడిగా ప్రసంగించిన చంద్రబాబు
  • సీఎం జగన్ పై నిప్పులు చెరుగుతూ ప్రసంగం
Chandrababu powerful speech in Bobbili

జగన్ రెడ్డి పాలనలో పెరిగిన నిత్యావసర ధరలతో పేదలు సంతోషంగా సంక్రాంతి పండుగ జరుపుకునే పరిస్ధితి కూడా లేదని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో నేడు నిర్వహించిన 'రా... కదలిరా' బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. 

‘‘నేడు జనసునామీతో  బొబ్బిలి కోట బొబ్బిలి పులిలా గర్జిస్తోంది. ఈ గర్జనకు తాడేపల్లి ప్యాలెస్ పిల్లి వణికిపోతోంది. గతంలో బొబ్బిలి రాజులు ప్రజల కోసం పనిచేశారు... నేడు సైకో స్వార్ధంతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. 5 కోట్ల ప్రజల భవిష్యత్తు కోసమే రా... కదలిరా అని పిలుపునిచ్చా. రోడ్లు కూడా సరిగా లేని సమయంలో ఆర్థిక సంస్కరణలు అందిపుచ్చుకుని రాష్ట్రాన్ని అభివృద్దిచేశాం. 

టెలికమ్యూనికేషన్ కు నాంది పలికాం. ఐటీ అభివృద్ధికి బాటలు వేశా. యువతకు అవకాశాలు కల్పిస్తే ప్రపంచాన్ని జయించే శక్తిగా ఎదుగుతారు. హైదరాబాద్ లో అడుగడుగునా నా అభివృద్ది కనిపిస్తుంది. నేను ఐటీ అభివృద్ది చేయటం వల్లే అనేక దేశాల్లో తెలుగు జాతి స్ధిరపడింది. నాకు కష్టం వచ్చినపుడు 80 దేశాల్లో తెలుగు వారు మద్దతు తెలిపారంటే అదీ మన సత్తా.


డ్రాయర్ కూడా లేని నిరుపేద జగన్

జగన్ రెడ్డి రాష్ట్రాన్ని అన్ని రంగాలలో రివర్స్ లో టాప్ లో పెట్టాడు. కానీ జగన్ ఆదాయం మాత్రం టాప్. దేశంలోకెల్లా రిచెస్ట్ సీఎం జగన్. కానీ 5 ఏళ్లలో పేదల ఆదాయం పెరిగిందా? వారి జీవన ప్రమాణాలు పెరిగాయా? 5 ఏళ్లలో దోచుకోవాల్సిదంతా దోచుకుని నిరుపేదనని, పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం అంటున్నారు. 

నేను పెత్తందారుడుని అంట... జగన్ నిరుపేద అంట. ఆయనకు సాక్షి పేపర్, సాక్షి టీవీ లేవంట... ప్యాలెస్ లు, ప్యాక్టరీలు కూడా లేవంట. కనీసం డ్రాయర్ కూడా లేని నిరుపేద జగన్. ముద్దులకు మురిసిపోయి మీరు ఓట్లు గుద్దారు. ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నాడు.

ఉత్తరాంధ్రలో పెత్తందార్ల పెత్తనం ఏంటి?

ఉత్తరాంధ్ర టీడీపీకి కంచుకోట. వెనుకబడిన వర్గాలు అధికంగా ఉండే ప్రాంతం ఉత్తరాంధ్ర. ఉత్తరాంధ్రలో మళ్లీ బీసీల రాజ్యం వస్తుంది. టీడీపీ - జనసేన ప్రభుత్వం బీసీలను అన్ని విధాలా ఆదుకుంటుంది. ఉత్తరాంధ్రకి విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలను జగన్ సామంతరాజులుగా నియమించారు. బీసీలు అధికంగా ఉన్న ప్రాంతంలో ఈ పెత్తందార్ల పెత్తనం ఏంటి? 

ఉత్తరాంధ్ర నుంచి బీసీ నాయకుడు ఎర్రన్నాయుడిని కేంద్రమంత్రిని చేసిన ఘనత టీడీపీది. కిమిడి కళా వెంకట్రావు సహా అనేక మందికి మంత్రి పదవులిచ్చాం. ఉత్తరాంధ్రకు నీళ్లు, పరిశ్రమలు తెచ్చి మౌళిక సదుపాయాలు కల్పించి యువతకు ఉపాధి కల్పిస్తాం. 

ఉత్తరాంధ్ర ఆస్తులపైనే శ్రద్ద... ప్రజలపై కాదు!

విశాఖ కేంద్రంగా అన్ని ప్రాంతాల్ని అభివృద్ది చేసి ఉత్తరాంధ్రను సస్యశ్యామలం చేస్తాం. టీడీపీ హయాంలో రూ.1,600 కోట్లు ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టుల కోసం ఖర్చు చేశాం. కానీ నేడు ఒక్క రూపాయైనా జగన్ ఖర్చు చేశాడా? ఒక్క ప్రాజెక్టు పూర్తి చేశారా? మద్దువలస, తారకరామ, తోటపల్లి, వంశధార వంటి ప్రాజెక్టులన్నీ టీడీపీ హయాంలో పూర్తి చేశాం. నేడు అన్ని ప్రాజెక్టులన్నీ నిర్వీర్యం చేశారు. 

శ్రీకాకుళంలో మహేంద్ర తనయ ఆప్ సోర్స్ ప్రాజెక్టు పూర్తి చేయలేదు. తోటపల్లి ప్రాజెక్టు ద్వారా 2 లక్షల ఎకరాలకు నీరివ్వొచ్చు. గన్ రెడ్డికి ఉత్తరాంధ్రలో ఉన్న ఆస్తులపై తప్ప ప్రజలపై ప్రేమ లేదు. విశాఖలో  రూ.40 వేల కోట్ల ఆస్తులు కొట్టేశారు. ఎక్కడ భూమి కనపడితే అక్కడ జగన్ కన్ను పడుతుంది. మెడపై కత్తి పెట్టి బెదిరించి ఆస్తులు రాయించుకుంటున్నారు. 

మీ ఇంట్లో చెత్త పక్క ఇంట్లో బంగారం అవుతుందా?

ఓటమి భయంతో జగన్ రెడ్డి ఎమ్మెల్యేలను మార్చుతున్నారు. అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకునే రకం జగన్ రెడ్డి. కొంతమంది మంత్రులకు కూడా సీటివ్వలేదు. కోడిగుడ్డు మంత్రికి సీటు ఇవ్వలేవు. ఆయన సొంత నియోజకవర్గంలో చెత్త అని తేలాక ఆయన్ని మరొక నియోజకవర్గంలో వేస్తే ప్రజలు అంగీకరిస్తారా? మీ ఇంట్లో చెత్త పక్కింట్లో వేస్తే బంగారం అవుతుందా? రాజాం ఎమ్మెల్యేని పాయకరావుపేటకి మార్చారు. కానీ అగ్రవర్ణాల వారిని మాత్రం మార్చకుండా జగన్ బతిమాలాడుకుంటున్నాడు. 

జగన్... నీ ఉద్యోగాన్ని ప్రజలు ఊడగొడతారు

బొబ్బిలిలో ఎమ్మెల్యే చినఅప్పలనాయుడు ప్రభుత్వ భూముల్ని యధేచ్చగా కబ్జా చేస్తున్నారు. అంగన్ వాడీలు ధర్నా చేస్తుంటే ఒళ్లు బలిసి చేస్తున్నారని బలిసిన మాటలు మాట్లాడుతున్నారు. అంగన్ వాడీలకు రూ.4 వేలు ఉన్న జీతం రూ.12 వేలకు పెంచిన ఘనత టీడీపీదే. జీతాలు పెంచమంటే ఎస్మా చట్టంతో వాళ్ల ఉద్యోగాలు తీసేస్తారా? జగన్ రెడ్డి...రేపు నీ ఉద్యోగం ఊడగొట్టేందుకు ప్రజలంతా సిద్దంగా ఉన్నారు. 

విజయనగరం పార్లమెంట్ పరిధిలోని  ఏడుగురు వైసీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచుకుంటున్నారు. ఎచ్చెర్ల ఎమ్మెల్యే వేధింపులు తట్టుకోలేక సాక్షి విలేకరి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎమ్మెల్యేపై జగన్ రెడ్డి ఎందుకు కేసు పెట్టలేదు? ఇంకెంతమందిని బలి తీసుకుంటారు?... అంటూ చంద్రబాబు మండిపడ్డారు.

  • Loading...

More Telugu News