Ambati Rayudu: ట్విస్ట్ అంటే ఇదే... పవన్ కల్యాణ్ ను కలిసిన అంబటి రాయుడు!

  • ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన అంబటి రాయుడు
  • రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉంటానని ప్రకటన
  • దుబాయ్ లో క్రికెట్ లీగ్ ఆడాల్సి ఉందని వివరణ
  • నేడు జనసేన పార్టీలో చేరే అవకాశం?
Ambati Rayudu met Pawan Kalyan

ప్రముఖ తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు కొన్నిరోజుల కిందటే వైసీపీలో చేరి, పది రోజులు గడవకముందే ఆ పార్టీకి రాజీనామా చేయడం ఓ సంచలనం! వైసీపీ తీరు నచ్చకే రాయుడు రాజీనామా చేశాడంటూ ఆ పరిణామాన్ని విపక్షాలు చక్కగా ఉపయోగించుకున్నాయి. 

రాయుడు తాను దుబాయ్ లో జరిగే ఇంటర్నేషనల్ టీ20 లీగ్ లో పాల్గొంటున్నానని, ఆ లీగ్ లో పాల్గొనేవాళ్లు రాజకీయాల్లో ఉండకూడదన్న నిబంధన ఉందని, అందుకే రాజీనామా చేయాల్సి వచ్చిందన్న కోణంలో ఓ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ ను పట్టుకుని వైసీపీ తన ప్రత్యర్థి పార్టీలపై ఎదురుదాడికి దిగింది. ఇప్పుడేమంటారు అంటూ టీడీపీ, జనసేన నేతలను ప్రశ్నించింది. 

ఇప్పుడు ఆ వ్యవహారం మరో మలుపు తిరిగింది. సంచలనం అంటే ఇదీ అని నిరూపించేలా అంబటి రాయుడు ఇవాళ జనసేనాని పవన్ కల్యాణ్ ను కలిశారు. అసలిది ఎవరూ ఊహించని పరిణామం! 

ఇటీవల తన ట్వీట్ లో... తాను కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంటానని రాయుడు పేర్కొనడంతో, రాజకీయాల్లో ఇడమలేక విసిగిపోయి ఉంటాడని అందరూ భావించారు. కానీ, నేడు పవన్ కల్యాణ్ ను కలిసిన నేపథ్యంలో, రాయుడి మదిలో ఆలోచనలు మరోలా ఉన్నాయన్న విషయం అర్థమవుతోంది.

అంబటి రాయుడు కొన్నాళ్ల కిందట క్రికెట్ కు వీడ్కోలు పలికాక, రాజకీయాలపై ఆసక్తి ప్రదర్శించారు. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా ట్వీట్లు చేయడంతో ఆయన రాజకీయాల్లోకి వస్తున్నాడన్న విషయం స్పష్టమైంది. వైసీపీ కూడా గుంటూరు ఎంపీ స్థానంపై భరోసా ఇచ్చి, ఇటీవల ఆ స్థానం మరొకరికి ఇచ్చే ఆలోచన చేసినట్టు కథనాలు వచ్చాయి. ఈ కారణంగానే రాయుడు వైసీపీకి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. 

ఇక, అంబటి రాయుడు కాపు సామాజిక వర్గానికి చెందినవాడు. జనసేనలో అయితే తాను సర్దుకుపోగలనని రాయుడు భావించి ఉంటాడన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కాసేపట్లో రాయుడు జనసేనాని పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరే అవకాశాలున్నాయని ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

More Telugu News