Drishti UAV: నేవీ చేతికి ‘దృష్టి’ డ్రోన్లు.. అదానీ కంపెనీ తయారీ

Indian Navy unveils the Drishti 10 Syarliner drones manufactured by Adani Defence in Hyderabad
  • సముద్రంపై నిఘా కోసం దేశీయంగా తయారైన డ్రోన్
  • 36 గంటల పాటు గాల్లోనే ఉండే సామర్థ్యం
  • 450 కిలోల వరకు పేలోడ్ ను తరలించేలా తయారీ
  • వాతావరణ మార్పులను తట్టుకునేలా రూపకల్పన

భారత నౌకా దళ శక్తి సామర్థ్యాలను మరింత పెంపొందించేలా నేవీ చేతికి సరికొత్త డ్రోన్ అందుబాటులోకి వచ్చింది. సముద్రంలో నిఘా కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన దృష్టి డ్రోన్ ను బుధవారం చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ ఆవిష్కరించారు. నౌకాదళ అవసరాలకు అనుగుణంగా ఈ మానవరహిత వైమానిక వాహనం (యూఏవీ) ను ప్రత్యేకంగా డిజైన్ చేయించామని వివరించారు. ఈ డ్రోన్ తో నౌకాదళ నిఘా సామర్థ్యం మరింత పెరుగుతుందని హరికుమార్ తెలిపారు.

హైదరాబాద్ లోని అదానీ ఎయిరోస్పేస్ పార్క్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఇంటెలిజెన్స్, నిఘా, గూఢచర్య (ఐఎస్ఆర్) కార్యకలాపాలలో దేశ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు, సముద్ర జలాల్లో భారత ఆధిపత్యం కొనసాగేందుకు తాజా ఆవిష్కరణ తోడ్పడుతుందని పేర్కొన్నారు. ఐఎస్ఆర్ టెక్నాలజీలో స్వయం సమృద్ధి దిశగా భారత్ వేగంగా అడుగులు వేస్తోందన్నారు. ‘దృష్టి’ చేరికతో భారత నౌకాదళం శక్తి సామర్థ్యాలు మరింత పెంపొందుతాయని, నిఘా, గూఢచర్యం విషయంలో నేవీ మరింత పట్టు సాధిస్తుందని చెప్పారు.

రక్షణ రంగానికి సంబంధించి చిన్న తరహా ఆయుధాల తయారీ విభాగంలో తొలి ప్రైవేట్ మ్యాన్యుఫాక్చరింగ్ కంపెనీని హైదరాబాద్ లో అదానీ గ్రూప్ ప్రారంభించింది. డ్రోన్ల తయారీతో పాటు వాటి నిర్వహణ బాధ్యతలను కూడా అదానీ గ్రూప్ చేపట్టనుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా దేశీయంగా డ్రోన్ల తయారీ, నిర్వహణ చేపట్టనున్నట్లు అదానీ గ్రూప్ ఓ ప్రకటనలో తెలిపింది. రక్షణ శాఖ అవసరాలకు అనుగుణంగా డ్రోన్లను తయారు చేయడంతో పాటు కౌంటర్ డ్రోన్ వ్యవస్థను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొంది.

దృష్టి డ్రోన్ ప్రత్యేకతల విషయానికి వస్తే.. ఏకధాటిగా 36 గంటల పాటు గాలిలోనే ఉంటూ నిఘా పెట్టగల సామర్థ్యం దీని సొంతం. దీంతోపాటు 450 కిలోల వరకు పేలోడ్ ను మోసుకెళ్లేలా ఈ డ్రోన్ ను డిజైన్ చేసినట్లు అదానీ గ్రూప్ వెల్లడించింది. సముద్ర జలాలపై వాతావరణ మార్పులను తట్టుకుంటూ, ఎలాంటి వాతావరణంలోనైనా గాల్లోకి లేచేలా ఈ డ్రోన్ ను తయారుచేసినట్లు తెలిపింది.

  • Loading...

More Telugu News