Yash Birthday Special: యశ్ నటుడిగా మారిన తర్వాత కూడా డ్రైవర్‌గా పనిచేసిన తండ్రి.. పుట్టిన రోజు సందర్భంగా కేజీఎఫ్ స్టార్‌ లైఫ్‌లోని ఆసక్తికర విషయాలు ఇవిగో!

KGF star Yash turns 38 today and here are few lesser known facts about him
  • 39వ వసంతంలోకి అడుగుపెట్టిన కన్నడ రాకింగ్ స్టార్
  • యశ్ అసలు పేరు నవీన్ కుమార్ గౌడ
  • ఓ స్టార్ నటుడి సూచన మేరకు పేరు మార్పు
  • ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓ రాత్రి బస్టాండ్‌లో పడుకున్న హీరో
కేజీఎఫ్ సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయిన కన్నడ నటుడు యశ్ నేడు (జనవరి 8) పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. ఈ రాకింగ్ స్టార్‌కి 38 ఏళ్లు నిండి 39వ వసంతంలోకి అడుగుపెట్టాడు. సాధారణ నేపథ్యం నుంచి పాన్ ఇండియా ‌స్టార్‌గా ఎదిగిన అతడికి బర్త్ విషెష్ వెల్లువలా వచ్చిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో యష్‌కి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం..

యశ్ అసలు పేరు నవీన్ కుమార్ గౌడ. ఓ స్టార్ నటుడి సూచన మేరకు చిన్ననాటి మారుపేరు యశ్‌ని స్ర్కీన్ నేమ్‌గా మార్చుకున్నాడు. కర్ణాటకలోని ఒక చిన్న గ్రామంలో పుట్టి పెరిగాడు. యశ్ తండ్రి బస్సు డ్రైవర్‌గా పని చేసేవారు. కొడుకు నటుడు అయిన తర్వాత కూడా ఆయన చాలా కాలం డ్రైవర్‌గా పనిచేశారు. 2014లో డ్రైవర్ పనికి గుడ్‌బై చెప్పారు. యశ్‌కి చిన్నప్పటి నుంచి నటన అంటే చాలా ఇష్టం. ఎంతగా అంటే యాక్టింగ్‌పై ఆసక్తితో ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో చదువు మానేశాడు. అతడిపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో యశ్ ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. రూ.300 పట్టుకొని బెంగళూరు సిటీ వెళ్లాడు. అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాడు. యశ్ చాలా కష్టపడి పరిచయాలు పెంచుకున్నాడు. తొలుత నాటకరంగంలోకి.. ఆ తర్వాత  ఒక సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా సెలక్ట్ అయ్యాడు. అయితే ఆ సినిమా ఆగిపోవడంతో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఒక రోజు రాత్రి బస్టాండ్‌లో నిద్రపోవాల్సిన దుస్థితిని ఎదుర్కొన్నాడు.

పట్టువిడవకుండా సినిమాలు, టీవీ సీరియల్స్ కోసం ఆడిషన్స్ ఇవ్వడం మొదలుపెట్టాడు. చిన్నచిన్న అవకాశాలను ఉపయోగించుకొని ఎదిగాడు. అనేక టీవీ షోలలో పనిచేసి ఆదరణ పెంచుకున్నాడు. 2008లో విడుదలైన ‘మొగ్గిన మనసు’ చిత్రంలో సహాయక పాత్రలో నటించాడు. ఆ సినిమాలో అతడి నటనకి అవార్డు వరించింది. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. యశ్ ఇష్టమైన నటులు అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్. కేజీఎఫ్ సినిమాకి హిందీ ప్రేక్షకుల నుంచి ఇంత ఆదరణ వస్తుందని భావించలేదని ఓ ఇంటర్వ్యూలో యశ్ చెప్పాడు. ఇక కేజీఎఫ్ సినిమాలో గరుడ పాత్రలో నటించింది యశ్ బాడీగార్డ్ రామ్. రామ్ 12 ఏళ్లుగా అతడికి బాడీగార్డ్‌గా పనిచేస్తున్నారు. ఈ సినిమా కోసం రామ్‌కి స్వయంగా యశ్ నటనలో మెలకువలు చెప్పాడు. యశ్ భార్య రాధిక కూడా నటించారు. వీరిద్దరూ 2016లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ కలిసి నాలుగు సినిమాల్లో కలిసి నటించారు.
Yash Birthday Special
Yash
KGF
movie news

More Telugu News