Badruddin Ajmal: 20-25 మధ్య ఇళ్ల నుంచి బయటకు రాకండి.. రామ మందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో ముస్లింలను అభ్యర్థించిన ఎంపీ

Badruddin Ajmal urges Muslims to stay home from January between 20 to 25
  • అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో బద్రుద్దీన్ పిలుపు
  • ముస్లింలకు బీజేపీ అతిపెద్ద శత్రువన్న ఏఐయూడీఎఫ్ చీఫ్
  • ఎంపీ వ్యాఖ్యలను తిప్పికొట్టిన బీజేపీ

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో ఈ నెల 20 నుంచి 25 మధ్య ముస్లింలు ఎవరూ బయటకు రాకుండా ఇళ్లలోనే ఉండాలని ఆల్ ఇండియా డెమొక్రటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్) అధ్యక్షుడు, లోక్‌సభ ఎంపీ బద్రుద్దీన్ అజ్మల్ పిలుపునిచ్చారు. అంతేకాదు, భారతీయ జనతా పార్టీని ముస్లింలకు అతిపెద్ద శత్రువుగా పేర్కొన్నారు.  

‘‘మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. జనవరి 20-25 మధ్య ప్రయాణాలు మానుకోండి. రామ మందిర ప్రారంభోత్సవాన్ని ప్రపంచం మొత్తం వీక్షిస్తుంది. లక్షలాదిమంది ప్రజలు బస్సులు, రైళ్లు, విమానాల్లో వస్తారు. కాబట్టి మనం శాంతియుతంగా ఉండాలి. ఈ సమయంలో మనం ప్రయాణాలు మానుకొని ఇళ్లలోనే ఉండాలి. ముస్లింలకు బీజేపీ అతిపెద్ద శత్రువు. అది మన ప్రాణాలకు, నమ్మకానికి, మసీదులకు, ఇస్లామిక్ చట్టాలకు, ఆజాన్‌‌కు శత్రువు అని పేర్కొన్నారు. అస్సాంలోని బార్పేటలో జరిగిన ఓ సభలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

బద్రుద్దీన్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ముస్లింలను బీజేపీ అసహ్యించుకోదని, తాము సబ్‌కా సాథ్, సబ్ కా వికాశ్ మంత్రతో పనిచేస్తున్నట్టు బీజేపీ స్పష్టం చేసింది. అయోధ్య భూ వివాదం కేసులో మాజీ లిటిగెంట్ ఇక్బాల్ అన్సారీని అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వానించామని, ప్రార్థనల్లో ఆయన కూడా పాలుపంచుకుంటారని పేర్కొంది. బద్రుద్దీన్ అజ్మల్, ఒవైసీ వంటివారు సమాజంలో వైషమ్యాలను వ్యాప్తి చేస్తున్నారని మండిపడింది. బీజేపీ అన్ని మతాలను గౌరవిస్తుందని స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News