Javed Akhtar: యానిమల్ సినిమాపై జావేద్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు

Javed Akhtar Says Commercial Success Of Films Like Animal Is Dangerous
  • ఇలాంటి సినిమాలు హిట్ కావడం ప్రమాదకరమన్న రచయిత
  • ఏ తరహా సినిమాలు తీయాలన్నది ప్రేక్షకులే నిర్ణయించాలని వ్యాఖ్య
  • యానిమల్ సినిమా పేరు ప్రస్తావించకుండా మండిపడ్డ జావేద్ అక్తర్

ఎలాంటి సినిమాలు రావాలనేది నిర్ణయించాల్సింది ప్రేక్షకులేనని ప్రముఖ సినీ రచయిత జావేద్ అక్తర్ పేర్కొన్నారు. ఇటీవల బ్లాక్ బస్టర్ గా నిలిచిన యానిమల్ సినిమాను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి సినిమాలు భారీ విజయాన్ని నమోదు చేయడం ప్రమాదకరమని చెప్పారు. యానిమల్ సినిమాలోని ఓ సన్నివేశాన్ని ఉదాహరణగా చెబుతూ.. హీరో తన ప్రేమను నిరూపించుకోవడానికి హీరోయిన్ ను బూట్లు నాకాలని అడగడం, మహిళలను చెంపదెబ్బ కొట్టడం సరైనదేనని చెప్పడం.. వంటి సీన్లు ఉన్నప్పటికీ ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ గా మారిందని, ఇలాంటి సినిమాలు ప్రమాదకరమని అక్తర్ చెప్పారు.

ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా నిర్మాతలకన్నా వాటిని ఆదరించే ప్రేక్షకులకే ఎక్కువ బాధ్యత ఉందని జావేద్ అక్తర్ అభిప్రాయపడ్డారు. నిర్మాతలు ఎలాంటి సినిమాలు తీయాలనేది ప్రేక్షకులపైనే ఆధారపడి ఉంటుందని, ప్రేక్షకాదరణను బట్టే సినిమాలను నిర్మిస్తారని వివరించారు. సినిమాలలో చూపించే విలువలు, నైతికతను గమనించి వాటిని ఆదరించాలా లేక తిరస్కరించాలా అనేది ప్రేక్షకుల చేతుల్లోనే ఉంటుందన్నారు.

ప్రస్తుతం సినీ రచయితలు సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నారని, స్క్రీన్ పై ఎలాంటి హీరోను నిలబెట్టాలని మదనపడుతున్నారని చెప్పారు. గతంలో ధనవంతులను చెడుగా, పేద వాళ్లను మంచివాళ్లుగా సినిమాలలో చూపించేవారని అక్తర్ గుర్తుచేశారు. మారిన పరిస్థితులలో పేద వాళ్లు కూడా ధనవంతులుగా మారుతున్నారని, దీంతో ధనవంతులను చెడుగా చూపించే పరిస్థితి ప్రస్తుతం లేదని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News