Bihar: రంజీ మ్యాచ్ కోసం బీహార్ నుంచి రెండు జట్లు... ఆశ్చర్యపోయిన క్రికెట్ వర్గాలు

Two teams comes from Bihar Cricket Association to play against Mumbai in Ranji Trophy
  • దేశంలో ప్రారంభమైన రంజీ సీజన్
  • ముంబయితో బీహార్ మ్యాచ్
  • బీహార్ క్రికెట్ సంఘంలో కుమ్ములాటలు
  • చెరొక జట్టును ఎంపిక చేసి పంపించిన అధ్యక్షుడు, కార్యదర్శి
  • అధ్యక్షుడి జట్టుకే ఆడే అవకాశం కల్పించిన రంజీ అధికారులు
భారత క్రికెట్ కు వెన్నెముక అనదగ్గ దేశవాళీ టోర్నమెంట్ గా రంజీ ట్రోఫీకి గుర్తింపు ఉంది. క్రికెట్ ను కెరీర్ గా ఎంచుకున్న ప్రతి ఒక్కరూ రంజీల్లో రాణించి టీమిండియాకు ఎంపికవ్వాలని కలలు కంటుంటారు. ఐపీఎల్ వచ్చినప్పటికీ, ఓ ఆటగాడి శక్తిసామర్థ్యాలకు రంజీ ట్రోఫీలో ఆటతీరే కొలమానంగా నిలుస్తోంది. 

దేశవాళీ క్రికెట్ లో ప్రధాన టోర్నీ అయిన రంజీ ట్రోఫీలో వివాదాలకు తక్కువేం లేదు. అసలు విషయానికొస్తే... నిన్నటి నుంచి తాజా రంజీ సీజన్ షురూ అయింది. ముంబయి, బీహార్ జట్ల మధ్య మ్యాచ్ కూడా తొలి రోజు షెడ్యూల్ లో ఉంది. 

అయితే, ఆశ్చర్యకరంగా ముంబయి జట్టుతో ఆడడానికి బీహార్ రాష్ట్రం తరఫు నుంచి రెండు జట్లు మైదానం వద్దకు రావడంతో గందరగోళం ఏర్పడింది. తాము ఏ జట్టుతో ఆడాలో తెలియక ముంబయి రంజీ టీమ్ అయోమయానికి గురైంది. తమకు ముంబయి జట్టుతో ఆడేందుకు అనుమతి ఇవ్వాలని ఆ రెండు జట్లు కోరడంతో మ్యాచ్ రిఫరీ సందిగ్ధంలో పడ్డారు. 

ఇంతకీ బీహార్ తరఫున రెండు జట్లు రావడం వెనుక ఆసక్తికర వ్యవహారం ఉంది. ఆ రెండు జట్లలో ఒకటి బీహార్ రాష్ట్ర క్రికెట్ సంఘం అధ్యక్షుడు రాకేశ్ తివారీ ఎంపిక చేయగా... మరో జట్టును బీహార్ క్రికెట్ సంఘం కార్యదర్శి అమిత్ కుమార్ ఎంపిక చేశారు. బీహార్ క్రికెట్ సంఘంలో రెండు వర్గాలు ఉండడంతో, ఏ వర్గానికి ఆ వర్గం తమ జట్టును ఎంపిక చేసి ముంబయితో మ్యాచ్ కు పంపించాయి. అందువల్లే ఈ విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. 

ఓ దశలో గొడవ జరగడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. చివరికి బీహార్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు ఎంపిక చేసిన జట్టునే ముంబయితో మ్యాచ్ ఆడేందుకు రంజీ అధికారులు అనుమతించారు.

కాగా, బీహార్ జట్టులో పన్నెండేళ్ల కుర్రాడిని కూడా ఎంపిక చేశారు. ఆ బాలుడి పేరు వైభవ్ సూర్యవంశీ. వైభవ్ వయసు 12 ఏళ్ల 284 రోజులు. అత్యంత పిన్న వయసులోనే రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసిన ఆటగాళ్లలో వైభవ్ నాలుగోవాడు.
Bihar
Mumbai
Ranji Trophy
India

More Telugu News