Revanth Reddy: మా పార్టీ నాయకురాలు షర్మిల రావడంతో ఆలస్యంగా వచ్చాను!: ఏబీఎన్ రాధాకృష్ణతో రేవంత్ రెడ్డి

Revanth Reddy says why he was late to debate
  • ఏబీఎన్ బిగ్ డిబేట్‌లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
  • అసాధ్యమనుకున్న దానిని సుసాధ్యం చేశామని వ్యాఖ్య
  • ప్రతిరోజు పరీక్షలకు ప్రిపేర్ అయి వెళ్తున్నట్లుగా పాలన కోసం వెళ్తున్నానని వ్యాఖ్య
తెలంగాణ రాష్ట్రానికి తాను రెండో ముఖ్యమంత్రి కావడం ఆనందంగా ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి బిగ్ డిబేట్ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఏబీఎన్ రాధాకృష్ణ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తమ ప్రభుత్వం ఏర్పడుతుందని ముందే చెప్పానని, అసాధ్యమనుకున్న దానిని సుసాధ్యం చేశామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారంలోకి వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. 

తాను ఈ కార్యక్రమానికి కాస్త ఆలస్యంగా వచ్చానని చెబుతూ.. అందుకు కారణం చెప్పారు. తాను బిగ్ డిబేట్ కార్యక్రమానికి ఏడు గంటలకే వద్దామనుకున్నానని... కానీ తమ పార్టీ నాయకురాలు షర్మిల తన ఇంటికి వచ్చి తన కొడుకు పెళ్లి పత్రికను అందించారని.. అందుకే కాస్త ఆలస్యమైందని చెప్పారు. కాంగ్రెస్ పాలన ఈ రోజుతో నెల రోజులు పూర్తి చేసుకుందన్నారు. జెడ్పీటీసీగా ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఆయా పదవులను బట్టి తన తీరులో మార్పు వస్తుందన్నారు. ఉదాహరణకు పీసీసీ చీఫ్‌గా తాను అగ్రెసివ్‌గా ఉండాలి కాబట్టి నిన్నటి వరకు అలా ఉన్నానని చెప్పారు. ప్రతిరోజు పరీక్షలకు ప్రిపేర్ అయి వెళ్తున్నట్లుగా ఇప్పుడు పాలన కోసం వెళ్తున్నానని చెప్పారు. కష్టపడుతూ.. తెలుసుకుంటూ.. నేర్చుకుంటూ పాలన చేస్తున్నానని చెప్పారు.
Revanth Reddy
Congress
Telangana
BJP

More Telugu News