Ch Malla Reddy: పార్టీ ఆదేశిస్తే మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తా: మాజీ మంత్రి మల్లారెడ్డి

  • మల్కాజిగిరి నుంచి పోటీ చేసిన అనుభవం ఉందన్న మల్లారెడ్డి
  • లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తారని ధీమా 
  • పార్టీ అధిష్ఠానం ఎంపీ స్థానాల విజయంపై ఫోకస్ చేసిందని వ్యాఖ్య
Malla Reddy ready to contest from Malkajgiri lok sabha seat

పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే రానున్న లోక్ సభ ఎన్నికల్లో తాను మల్కాజిగిరి స్థానం నుంచి పోటీ చేస్తానని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... గతంలో తాను మల్కాజిగిరి లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి గెలిచానని గుర్తు చేశారు. మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలైన మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించిన విషయాన్ని గుర్తు చేశారు.

వచ్చే లోక్ సభ ఎన్నికల్లోనూ ఇదే తరహాలో ప్రజలు తమ పార్టీని ఆదరిస్తారని ధీమా వ్యక్తం చేశారు. మల్కాజిగిరి లోక్ సభ స్థానంతో పాటు రాష్ట్రంలో అత్యధిక లోక్ సభ స్థానాలను బీఆర్‌ఎస్ గెలుస్తుందన్నారు. ఇప్పటికే బీఆర్‌ఎస్ అధిష్ఠానం ఎంపీ స్థానాల విజయంపై ఫోకస్ చేసిందన్నారు. లోక్ సభ స్థానాల వారీగా సమీక్షలు నిర్వహించి బీఆర్‌ఎస్ గెలుపే లక్ష్యంగా పని చేయనున్నట్లు వెల్లడించారు. తాను పోటీ చేసే విషయమై అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్ సమీక్షా సమావేశాన్ని ఈ నెల 21 తెలంగాణ భవన్‌లో పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులతో అధిష్ఠానం నిర్వహిస్తుందన్నారు.

More Telugu News