Chandrababu: 45 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నా.. ఇంత దారుణం చూడలేదు: చంద్రబాబు

Chandrababu lashes out at jagan Mangalagiri
  • బుధవారం టీడీపీలో చేరిన పులువురు కీలక వైసీపీ నేతలు
  • మంగళగిరిలో ఎన్టీఆర్ భవన్‌లో నేతలకు కండువా కప్పి ఆహ్వానించిన బాబు
  • రాష్ట్రానికి జగన్ అక్కర్లేదని సర్వేలు చెబుతున్నాయని వ్యాఖ్య
తాను 45 ఏళ్ల రాజకీయాల్లో ఉన్నా  జగన్ అంతటి దారుణమైన సీఎంను, పాలనను చూడలేదని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం మంగళగిరిలో ఎన్టీఆర్ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ద్వారకానాథ రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య, మాజీ మంత్రి దాడి వీరభద్రరావుతో పాటూ వివిధ జిల్లాలకు చెందిన వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. చంద్రబాబు వారికి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రూ.12 లక్షల అప్పు చేసినా అభివృద్ధి కుంటుపడిందన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం అప్పులమయం అయిందన్నారు. ‘‘టీడీపీ హయాంలో 100 సంక్షేమ పథకాలు అమలు చేశాం. కానీ, వాటన్నింటినీ వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది.

ఎమ్మెల్యేలను బదిలీ చేయడం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. వైసీపీ నాయకులను ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ఐదేళ్లుగా ఎమ్మెల్యేలు తప్పులు చేస్తుంటే మీరు, మీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తోంది. ఎవరికి రావాల్సింది వారు దోచుకుతిన్నారు. సర్వేల పేరుతో నాటకాలాడుతున్నారు. రాష్ట్రానికి జగన్ అక్కర్లేదని సర్వేలు చెబుతున్నాయి. ఇసుక, మద్యం దందాలతో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారు.

జగన్.. రాజధాని మార్చలేవు. విశాఖపట్నం వెళ్లలేవు. ఏప్రిల్ తర్వాత టీడీపీ ప్రభుత్వమే వస్తుంది. మంచికి..చెడుకీ తేడా తెలియని వ్యక్తి జగన్. టీడీపీ-జనసేన అధికారం కోసం ప్రయత్నించడం లేదు. 5 కోట్ల మంది ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. జగన్ రాజకీయాల్లో లేకపోతే రాష్ట్రంలో ఇంత విధ్వంసం జరిగేది కాదు. పార్టీనే కాకుండా రాష్ట్రాన్ని కూడా గందరగోళంలోకి నెట్టారు’’ అని చంద్రబాబు విమర్శించారు.
Chandrababu
Jagan
YSRCP
Telugudesam

More Telugu News