Zomato: గుర్రపు స్వారీ చేస్తూ వెళ్లి ఆర్డర్ డెలివరీ.. వీడియో ఇదిగో!

Zomato Agent Delivers Food On Horse Amid Long Queues At Petrol Pumps
  • పెట్రోల్ దొరకక పోవడంతో గుర్రమెక్కిన జొమాటో బాయ్
  • హైదరాబాద్ లో ఘటన.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
  • సిటీలో పెట్రోల్ బంకుల వద్ద భారీగా వాహనాల క్యూ
పెట్రోల్ కొరత నేపథ్యంలో హైదరాబాద్ లో వాహనదారులు బంకుల ముందు బారులు తీరారు. వాహనాలతో క్యూ కట్టి గంటల తరబడి పెట్రోల్ కోసం వేచి ఉన్నారు. ఇలా గంటలకొద్దీ వెయిట్ చేసి చేసి విసుగెత్తిపోయిన ఓ జొమాటో డెలివరీ బాయ్ తన బైక్ ను పక్కన పెట్టేసి గుర్రమెక్కాడు. ఆర్డర్ తీసుకున్న ఫుడ్ ను గుర్రపు స్వారీ చేస్తూ వెళ్లి కస్టమర్లకు అందించాడు. రోడ్డు మీద వేగంగా దూసుకెళుతున్న వాహనాల మధ్య గుర్రం పరుగులు పెట్టడం, దానిపై జొమాటో డెలివరీ బాయ్ కనిపించడంతో వాహనదారులు ఆశ్చర్యంగా చూస్తూ వెళ్లారు. హైదరాబాద్ లోని చంచల్ గూడ ఏరియాలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుందీ ఘటన. 

గుర్రపు స్వారీ చేస్తూ వెళుతున్న డెలివరీ బాయ్ ను వాహనదారులు పలకరించి ఏం జరిగిందంటూ విచారించగా.. మూడు గంటల పాటు క్యూలో ఉన్నప్పటికీ పెట్రోల్ దొరకలేదంటూ సదరు డెలివరీ బాయ్ జవాబిచ్చాడు. ఆర్డర్ తీసుకున్నాక బండిలో పెట్రోల్ అయిపోయిందని, బంకు వద్ద భారీగా క్యూ ఉందని చెప్పాడు. క్యూలో ఎంతసేపు ఎదురుచూసినా పెట్రోల్ దొరకకపోవడంతో ఇలా గుర్రంపై వెళుతున్నానని చెప్పుకొచ్చాడు. ఈ ఘటనను పలువురు నెటిజన్లు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో అదికాస్తా వైరల్ గా మారింది.
Zomato
Horse Ride
Food delivery
Hyderabad
Zomato Agent
Petrol pumps

More Telugu News