truck drivers: దేశవ్యాప్తంగా సమ్మె విరమించిన ట్రక్కు డ్రైవర్లు

truck drivers across the country are withdrawn from strike
  • ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటామని కేంద్రం హామీ ఇవ్వడంతో వెనక్కి తగ్గిన ట్రక్కు, ట్యాంకర్ డ్రైవర్లు
  • హిట్ అండ్ రన్ కేసుల్లో జైలుశిక్షను పెంచడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న డ్రైవర్లు
  • డ్రైవర్ల ఆందోళనల కారణంగా పెట్రోల్ బంకుల్లో ఇంధనం అడుగంటడంతో రంగంలోకి దిగిన కేంద్రం
కొత్త చట్టం భారత న్యాయ సంహిత(బీఎన్‌ఎస్)లోని నిబంధనలను అమలు చేయడానికి ముందు అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ట్యాంకర్‌, ట్రక్కు డ్రైవర్లు దేశవ్యాప్తంగా సమ్మెను విరమించారు. హిట్ అండ్ రన్ కేసుల్లో జైలుశిక్షను నాలుగేళ్ల నుంచి పదేళ్లకు పెంచడంపై డ్రైవర్లు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. 

అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం ఆల్‌ ఇండియా మోటార్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కాంగ్రెస్ (ఏఐఎంటీసీ) ప్రతినిధులతో మంగళవారం సమావేశమై అభ్యంతరాలపై చర్చించింది.  కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ కుమార్‌ భల్లా అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. హిట్ అండ్ రన్ కేసుల్లో జైలుశిక్షాకాలం పెంచడం పేద ట్రక్కు డ్రైవర్లకు శాపంగా మారుతుందని ఏఐఎంటీసీ ప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. 

దీంతో ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటామని అజయ్‌ భల్లా హామీ ఇవ్వడంతో డ్రైవర్లు సమ్మె విరమించారు. కొత్త చట్టం అమలును వ్యతిరేకిస్తూ సోమవారం దేశవ్యాప్తంగా ట్యాంకర్, ట్రక్కు డ్రైవర్లు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. మంగళవారం ఈ ఆందోళన మరింత ఉద్ధృతమైంది. వీరికి ప్రైవేట్‌ బస్సులు, క్యాబ్‌ డ్రైవర్లు కూడా సంఘీభావం తెలపడంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. 

కాగా ట్యాంకర్‌, ట్రక్కు డ్రైవర్లు తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర, హిమాచల్‌ప్రదేశ్‌, జమ్మూకశ్మీర్‌, పంజాబ్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో సమ్మె చేపట్టారు. ఎక్కడికక్కడ ట్యాంకర్లు నిలిచిపోవడం తీవ్ర ప్రభావాన్ని చూపింది. ముఖ్యంగా ట్యాంకర్లు అందుబాటులో లేకపోవడంతో పలు రాష్ట్రాల్లో ఇంధన కొరత ఏర్పడింది. వాహనదారులు పెట్రోల్‌ బంకులకు పోటెత్తడంతో ఆందోళనకర పరిస్థితులు చవిచూడాల్సి వచ్చింది. వేలాది బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపించాయి.
truck drivers
Drivers strike
Central govt
BNS law

More Telugu News