Anil Kumar Poluboina: ఆసక్తికరంగా నెల్లూరు రాజకీయాలు... మాజీ మంత్రి నారాయణకు సవాల్ విసిరిన అనిల్ కుమార్ యాదవ్

Anil Kumar Yadav challenges former minister Narayana
  • తాను మరో చోట పోటీచేస్తానని దుష్ప్రచారం చేస్తున్నారన్న అనిల్
  • దమ్ముంటే నారాయణ నెల్లూరు సిటీ నుంచి పోటీ చేయాలని వ్యాఖ్యలు
  • నారాయణ పోటీ చేస్తే మళ్లీ ఓడిస్తానన్న అనిల్
వచ్చే ఎన్నికల్లోనూ నెల్లూరు సిటీ నుంచి గెలిచేది తానేనని మాజీ మంత్రి, వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ... తనకు దమ్ము ఉంది, అన్నీ ఉన్నాయని, నెల్లూరు నగరం నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. 

ఈ సందర్భంగా అనిల్ కుమార్... మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణకు సవాల్ విసిరారు. ఈసారి ఎన్నికల్లో జనసేన నేత మనుక్రాంత్ రెడ్డి కాకుండా తానే పోటీ చేస్తానని నారాయణ ప్రకటించాలని అన్నారు. ఒకవేళ నారాయణే పోటీ చేస్తే మళ్లీ ఆయనను ఓడిస్తానని అనిల్ కుమార్ వ్యాఖ్యానించారు.

"మధ్యతరగతి కుటుంబాల నుంచి వందల కోట్లు వసూలు చేసి డబ్బు మదంతో ఉన్నావు. నీ బతుక్కి నేరుగా పార్టీ టికెట్ తెచ్చుకోలేకపోయావు. ఆ పార్టీలో పైస్థాయిలో ఉన్న వ్యక్తికి రూ.30 కోట్లు, కింది స్థాయిలో ఉన్న వ్యక్తికి 20 కోట్లు ఇచ్చి... ఉత్తరాంధ్రలో ఉన్న నీ బంధువు మధ్యవర్తిత్వంతో టికెట్ తెప్పించుకున్నావు. నువ్వా నన్ను విమర్శించేది? 

అనిల్ ఈసారి ఆ నియోజకవర్గం నుంచి పోటీచేస్తాడని, అనిల్ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాడని నీ మనుషులతో చెప్పిస్తావా? అనిల్ కనిగిరి పోతాడని ఒకడు, కందుకూరు పోతాడని ఒకడు, వెంకటగిరి పోతాడని ఒకడు, ఎంపీగా పోటీ చేస్తాడని ఒకడు మాట్లాడతాడు. 

ఇలా ఇన్ని చోట్ల  పోటీ చేయగలిగిన అభ్యర్థి అంటే అనిల్ కుమార్ గొప్పవాడే కదా! టికెట్ ఇవ్వకపోతే బాధపడాలి కానీ, అన్ని నియోజకవర్గాల నుంచి పోటీ చేయగలిగినవాడ్ని అయితే జగన్ ఆశీస్సుల వల్ల గట్టివాడ్నే కదా" అని అనిల్ కుమార్ వ్యాఖ్యానించారు.
Anil Kumar Poluboina
P Narayana
Nellore City
YSRCP
TDP
Andhra Pradesh

More Telugu News