Planes: జపాన్ లో రన్ వేపై ఢీకొన్న రెండు విమానాలు... ఐదుగురి మృతి

Two planes collided in Tokyo airport in earthquake hit Japan
  • ఇప్పటికే భూకంపంతో విషాదంలో ఉన్న జపాన్
  • నేడు టోక్యోలో రెండు విమానాలు ఢీ... మంటల్లో చిక్కుకున్న విమానాలు
  • ప్రయాణికుల విమానం, కోస్ట్ గార్డ్ విమానం ఢీ
  • భూకంప బాధితులకు సహాయ సామగ్రి తీసుకెళుతున్న కోస్ట్ గార్డ్ విమానం
ఓవైపు భూకంపం సృష్టించిన విలయంతో విషాదంలో ఉన్న జపాన్ ను విమాన ప్రమాద ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది. టోక్యోలోని హనేదా ఎయిర్ పోర్టులో రెండు విమానాలు ఢీకొన్న ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఇందులో ఒకటి ప్రయాణికుల విమానం కాగా... మరొకటి జపాన్ కోస్ట్ గార్డ్ కు చెందిన విమానం. 

కోస్ట్ గార్డ్ విమానం జపాన్ పశ్చిమ తీరంలో భూకంప బాధితుల కోసం సహాయ సామగ్రి తీసుకుని వెళుతుండగా... రన్ వేపై ప్రయాణికుల విమానం ఢీకొట్టింది. కోస్ట్ గార్డ్ విమానంలో ఆరుగురు సిబ్బంది ఉండగా, ఫ్లయిట్ కెప్టెన్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. మిగతా ఐదుగురు సిబ్బంది మృతి చెందారు. 

అటు, ప్రమాదం జరిగిన సమయంలో ప్రయాణికుల విమానంలో 379 మంది ఉన్నారు. వీరందరూ సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, రన్ వేపై ఢీకొన్న వెంటనే విమానాలు మంటల్లో చిక్కుకున్నాయి. ఈ ప్రమాదం జరిగిన వెంటనే హనేదా ఎయిర్ పోర్టులో ఇతర రన్ వేలను కూడా మూసివేశారు. 

జపాన్ లో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో టోక్యోలోని హనేదా ఎయిర్ పోర్టు ఒకటి. నూతన సంవత్సరాది కారణంగా ఈ ఎయిర్ పోర్టు నుంచి రాకపోకలు మరింత పెరిగాయి.
Planes
Collision
Haneda Airport
Tokyo
Japan
Earthquake

More Telugu News