ISRO: కొత్త ఏడాది ఇస్రోకు తొలి విజయం.. ఎక్స్‌పోశాట్ ప్రయోగం విజయవంతం

ISRO successfully launches xposat into orbit pslv c58
  • నేటి ఉదయం 9.10 గంటలకు ఉపగ్రహంతో నింగిలోకి ఎగసిన పీఎస్‌ఎల్‌వీ-సీ58 రాకెట్
  • ఆ తరువాత 21 నిమిషాలకు కక్ష్యలోకి ఉపగ్రహం
  • కృష్ణబిలాల అధ్యయనమే లక్ష్యంగా ఎక్స్‌పోశాట్ ప్రయోగం
నూతన సంవత్సరం తొలి రోజునే భారత అంతరిక్ష సంస్థ ఇస్రోకు శుభారంభం లభించింది. ఎక్స్-రే పొలారీమీటర్ ఉపగ్రహాన్ని (ఎక్స్‌పోశాట్) ఇస్రో నేడు దిగ్విజయంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. తిరుపతి జిల్లాలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నేటి ఉదయం 9.10 గంటలకు ఎక్స్‌పోశాట్‌తో పీఎస్ఎల్వీ సీ58 రాకెట్ నిప్పులు కక్కుతూ నింగిలోకి ఎగసింది. ప్రయోగం తరువాత 21 నిమిషాలకు ఎక్స్‌పోశాట్ నిర్దేశిత కక్ష్యలోకి చేరుకుంది. 

ఎక్స్‌పోశాట్‌తో పాటూ తిరువనంతపురం ఎల్‌బీఎస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్ కాలేజ్ విద్యార్థినులు తయారు చేసిన విమెన్ ఇంజినీర్డ్ శాటిలైట్ సహా వివిద ఉపకరణాలు కూడా ఉన్నాయి. 

ప్రయోగం చివరి దశలో పీఎస్‌ఎల్‌వీ మరో పది పరికరాలతో కూడిన పీఎస్‌ఎల్‌వీ ఆర్బిటల్ ఎక్స్‌పెరిమెంటల్ మాడ్యూల్‌ను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.

ఎక్స్‌పోశాట్ లక్ష్యం ఇదీ.. 
ఐదేళ్ల జీవిత కాలంతో రూపొందిన ఎక్స్‌పోశాట్ ప్రధాన లక్ష్యం కృష్ణబిలాల అధ్యయనమని ఇస్రో తెలిపింది. ఎక్స్‌రే ఫొటాన్లు, వాటి పొలరైజేషన్ ద్వారా కృష్ణబిలాలు, న్యూట్రాన్ స్టార్ల దగ్గర రేడియేషన్‌పై ఎక్స్‌పోశాట్ అధ్యయనం చేయనుంది. అమెరికా తరువాత ఇలాంటి ప్రయోగం చేపట్టిన దేశం భారత్‌యేనని ఇస్రో వర్గాలు తెలిపాయి.
ISRO
XpoSat
PSLV-c58

More Telugu News