Anagani Satyaprasad: జగన్ రెడ్డి సైకో ప్రభుత్వాన్ని పారిశుద్ధ్య కార్మికులే ఊడ్చి పారేస్తారు: అనగాని సత్యప్రసాద్

Anagani Satyaprasad supports sanitary workers strike and slammed CM Jagan administration
  • రాష్ట్రంలో పారిశుద్ధ్య కార్మికుల సమ్మె
  • టీడీపీ హయాంలో పారిశుద్ధ్య కార్మికులకు రక్షణ పరికరాలు ఇచ్చామన్న అనగాని
  • జగన్ పాలనలో కార్మికులను పట్టించుకోవడంలేదని విమర్శలు
కరోనా కష్టసమయంలో ప్రాణాలను పణంగా పెట్టి సేవలందించిన పారిశుద్ధ్య కార్మికులతో జగన్ రెడ్డి సర్కారు చెలగాటమాడుతోందని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. కరోనా సమయంలో పారిశుద్ధ్య కార్మికులకు కనీసం మాస్కులు, శానిటైజర్లు, గ్లౌజులు కూడా ఇవ్వని జగన్ రెడ్డి కుళ్లిన సర్కారును రానున్న ఎన్నికల్లో పారిశుద్ధ్య కార్మికులే ఊడ్చి చెత్తకుప్పలో పడేయడానికి సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. గత పాలనలో పారిశుద్ధ్య కార్మికులకు ఇచ్చిన రక్షణ పరికరాలేవీ జగన్ రెడ్డి ఇవ్వడం లేదని అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. 

"స్కానింగ్ మెషీన్లు ఇచ్చి పారిశుద్ధ్య కార్మికులపై పని ఒత్తిడి పెంచారు. రిటైర్ అయిన కార్మికుల స్థానంలో కొత్త వారికి ఉద్యోగాలు ఇవ్వకుండా పనిభారాన్ని మోపి విశ్రాంతి లేకుండా చేస్తున్నారు. పనికి తగిన వేతనాలు ఇవ్వకుండా వేధిస్తున్న జగన్ సర్కారు కార్మికుల ఆగ్రహజ్వాలల్లో కాలిపోక తప్పదు. మున్సిపల్ కార్మికులను ఆప్కాస్ లో చేర్చి వారికి వేతనాలు మాత్రం నామమాత్రంగా ఇస్తూ అన్యాయం చేస్తున్నారు. 

నిరంతరం విషపూరిత మలినాల మధ్య పనిచేసే కార్మికులకు కనీసం హెల్త్ అలవెన్సులు కూడా వైసీపీ సర్కారు ఇవ్వకపోవడం దుర్మార్గం. పండుగలు, శుభకార్యాలకు కూడా సెలవులు ఇవ్వకుండా కార్మికులను వేధిస్తున్నారు. పట్టణాల్లో విలీనం చేసిన గ్రామాల కార్మికులను నేటికీ ఆప్కాస్ లో చేర్చకుండా జాప్యం చేయడం అన్యాయం. జగన్మోహన్ రెడ్డి అనాలోచిత, నిరంకుశ విధానాలతో పారిశుద్ధ్య కార్మికుల జీవన స్థితిగతులు అగమ్యగోచరంగా మారింది. 

క్లీన్ ఏపీ పేరుతో వాహనాలను తెచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ వాహనాల డ్రైవర్లకు వేతనాలు ఇవ్వడంలో పక్షపాతం చూపిస్తోంది. తాడేపల్లి ప్యాలెస్ ఖజానాకు లక్షల కోట్లు జమ చేసుకుంటున్న జగన్ రెడ్డికి... పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు పెంచడానికి మనసు రావడం లేదు. కార్మికులు సమ్మెకు దిగినప్పటికీ ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్లు కూడా లేకపోవడం కార్మికుల పట్ల జగన్ రెడ్డి నిర్లక్ష్య ధోరణికి అద్దం పడుతుంది. 

కొన్నిచోట్ల కార్మికులను బెదిరించి, మోసపూరిత హామీలు ఇచ్చి పనులు చేయించుకుంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోంది. జగన్మోహన్ రెడ్డి తక్షణమే స్పందించి మున్సిపల్ కార్మికుల న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నాం" అని స్పష్టం చేశారు.
Anagani Satyaprasad

More Telugu News