Amitabh Bachchan: ముగిసిన కౌన్ బనేగా కరోడ్ పతి సీజన్-15... అమితాబ్ కంట కన్నీరు

Amitab Bachchan gets emotional in KBC Season 15 last episode
  • దేశంలో అతిపెద్ద టెలివిజన్ క్విజ్ షో కేబీసీ
  • హోస్ట్ గా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్
  • తాజా సీజన్ ముగియడంతో భావోద్వేగాలతో వీడ్కోలు పలికిన అమితాబ్
భారతదేశ బుల్లితెర చరిత్రలో అతిపెద్ద క్విజ్ షో అంటే కౌన్ బనేగా కరోడ్ పతి (కేబీసీ) అనే చెప్పాలి. కోటి రూపాయలు గెలుచుకునే అవకాశం ఉండడంతో ఈ షో అత్యంత విజయవంతమైంది. 

ఇక, కేబీసీని, బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ను వేరువేరుగా చూడలేం. ఆ కార్యక్రమ హోస్ట్ గా అమితాబ్ అంత బలమైన ముద్రవేశారు. కంటెస్టెంట్లను  కుటుంబసభ్యుల్లా ఆత్మీయంగా పలకరించి, వారిలో బెరుకు పోగొట్టి, ఛలోక్తులు విసురుతూ... నవ్వుతూ, నవ్విస్తూ, కొన్నిసార్లు ఉత్కంఠకు గురిచేస్తూ, కొన్నిసార్లు కంటెస్టెంట్లను టెన్షన్ కు గురిచేస్తూ... ఓవరాల్ కేబీసీ షోను రక్తికట్టించడంలో బిగ్ బి పాత్ర ఎనలేనిది. 

అనేక సీజన్లుగా కేబీసీతో అమితాబ్ అనుబంధం కొనసాగుతూ వస్తోంది. తాజాగా కేబీసీ సీజన్-15 ముగిసింది. ఈ సీజన్ ముగింపు సందర్భంగా అమితాబ్ బచ్చన్ తీవ్ర భావోద్వేగాలకు గురయ్యారు. ఆయన కంట కన్నీరు ఒలికింది. 

"లేడీస్ అండ్ జెంటిల్మెన్... ఈ వేదిక రేపటి నుంచి కనిపించదు... ఈ సీజన్ కు ఇదే చివరి ఎపిసోడ్... రేపటి నుంచి మేం ఇక్కడికి రాబోవడంలేదు... ఈ సీజన్ లో చివరిసారిగా చెప్పేది ఒక్కటే... గుడ్ నైట్, గుడ్ నైట్" అంటూ ఉద్వేగభరితంగా వ్యాఖ్యానించారు. 

అమితాబ్ అంతటివాడు కంటతడి పెట్టేసరికి ఆడియన్స్ కూడా భావోద్వేగాలకు లోనయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Amitabh Bachchan
KBC
Season-15
Quiz Show
India

More Telugu News