Talasani: ఆరు గ్యారెంటీల దరఖాస్తులు ప్రజలకు సరిపడా అందుబాటులో లేవు: తలసాని

Minister talasani on Six guarentees
  • ఆరు గ్యారెంటీలు ఎప్పటిలోగా అమలు చేస్తారో చెప్పాలన్న తలసాని
  • అర్హులను ఎప్పటిలోగా ఎంపిక చేస్తారని మాజీ మంత్రి ప్రశ్న
  • దరఖాస్తుల కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వ్యాఖ్య
ఆరు గ్యారెంటీలను ఎప్పటిలోగా అమలు చేస్తారో చెప్పాలని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. ఈ గ్యారెంటీలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. శనివారం ఆయన సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని కార్పోరేటర్లు, మాజీ కార్పోరేటర్లు, బీఆర్ఎస్ నేతల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఆరు గ్యారెంటీలను ఎప్పటిలోగా అమలు చేస్తారు? ప్రజల నుంచి స్వీకరిస్తున్న దరఖాస్తులలో అర్హులను ఎప్పటిలోగా ఎంపిక చేస్తారు? అని ప్రశ్నించారు.

గ్యారెంటీల దరఖాస్తులు ప్రజలకు సరిపడా అందుబాటులో లేవని... వీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని విమర్శించారు. కొన్నిచోట్ల కొనుగోలు చేయాల్సి వస్తోందని.. ప్రభుత్వం దీనిని అరికట్టాలని డిమాండ్ చేశారు. కొత్త రేషన్ కార్డు దరఖాస్తుల కోసం నిర్దిష్టమైన దరఖాస్తులను ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలని సూచించారు. ప్రజల కోసం చేసే ఏ పనికైనా తాము ప్రభుత్వానికి సహకరిస్తామన్నారు. ఆరో తేదీలోగా అర్హులైనవారు ఆరు గ్యారంటీల కోసం దరఖాస్తు చేసుకోవాలని తన నియోజకవర్గంలోని వారికి తలసాని సూచించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలను పార్లమెంట్ ఎన్నికల వరకు కూడా అమలు చేయకుండా కాలయాపన చేయాలని చూస్తుందనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే ప్రజలే ప్రభుత్వాన్ని నిలదీస్తారని హెచ్చరించారు. జనవరి 2వ తేదీ నుంచి నియోజకవర్గ పరిధిలోని బస్తీలు, కాలనీలలో తాను పర్యటిస్తానని తలసాని తెలిపారు.
Talasani
Congress
Telangana
BRS

More Telugu News