Anganwadi Stike: మంత్రుల ఇళ్లను ముట్టడిస్తున్న అంగన్వాడీలు.. మంత్రి పెద్దిరెడ్డి ఇంటి ముట్టడికి ర్యాలీగా బయలుదేరిన అంగన్వాడీ కార్యకర్తలు

AP anganwadis besieging the houses of ministers
  • నేటితో 19వ రోజుకు అంగన్వాడీల సమ్మె
  • మార్కాపురంలో మంత్రి సురేశ్, గుంటూరులో విడదల రజని ఇళ్లను ముట్టడించిన అంగన్వాడీలు
  • మంత్రి ఉషశ్రీ చరణ్ ఇంటి ముట్టడికి వెళ్తుండగా అడ్డుకున్న పోలీసులు
  • తిరుపతిలో అడ్డుకోవడంతో రోడ్డుపైనే బైఠాయించిన వైనం

తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఏపీ అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు మంత్రుల ఇళ్లను ముట్టడిస్తున్నారు. మార్కాపురంలో మంత్రి సురేశ్ ఇంటిని ముట్టడించిన అంగన్వాడీలు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆయన ఇంటిబయట బైఠాయించారు. ఈ సందర్బంగా పోలీసులు, అంగన్వాడీలకు మధ్య తోపులాట జరిగింది. అలాగే, గుంటూరులోని శ్యామలనగర్‌లో మంత్రి విడదల రజిని ఇంటిని కూడా ముట్టడించారు. ఈ కార్యక్రమంలో నాలుగు నియోజకవర్గాలకు చెందిన అంగన్వాడీలు పాల్గొన్నారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు సమ్మె కొనసాగుతుందని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా రజిని మాట్లాడుతూ.. అంగన్వాడీల సమస్యలను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.  

మరోవైపు, మంత్రి ఉషశ్రీ చరణ్ ఇంటి ముట్టడికి అంగన్వాడీలు పిలుపునివ్వడంతో కళ్యాణదుర్గం నుంచి వెళ్తున్న అంగన్వాడీలను పోలీసులు అడ్డుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో వారు స్టేషన్‌లో బైఠాయించి నిరసన తెలిపారు. తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి ఇంటిని ముట్టడించేందుకు అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పెద్ద ఎత్తున తరలివెళ్తున్నారు. అంబేద్కర్ భవన్ నుంచి ర్యాలీగా మంత్రి ఇంటికి బయలుదేరారు. వెస్ట్ చర్చి కూడలిలో పోలీసులు వారిని అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపైనే బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. పలితంగా రాకపోకలు స్తంభించడంతో ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. కాగా, సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు చేపట్టిన సమ్మె నేటితో 19వ రోజుకు చేరుకుంది.

  • Loading...

More Telugu News