cs shanthi kumari: దరఖాస్తు ఫారాలు విక్రయించకుండా చూడాలి: ప్రజాపాలనపై తెలంగాణ సీఎస్ శాంతికుమారి

CS Shanti Kumari on Praja Palana on second day
  • ప్రజాపాలనకు విశేష స్పందన లభిస్తోందన్న సీఎస్ 
  • ఎదురైన సమస్యలు రేపటి నుంచి పునరావృతం కాకుండా చూస్తామని వెల్లడి
  • ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచన

ప్రజాపాలనకు విశేష స్పందన లభిస్తోందని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. నిన్నటి నుంచి ప్రారంభమైన ప్రజాపాలన కార్యక్రమం జనవరి 6వ తేదీ వరకు కొనసాగనుంది. ప్రజాపాలన కార్యక్రమం రెండో రోజుల నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో సీఎస్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... నేడు ప్రజాపాలన రెండో రోజు కార్యక్రమం ముగిసిందని... ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించిందన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఎదురైన సమస్యలను రేపటి నుంచి పునరావృతం కాకుండా చూస్తామని పేర్కొన్నారు. దరఖాస్తు ఫారాలను ప్రభుత్వమే ఉచితంగా అందిస్తోందని... వాటిని ఎవరూ కొనుగోలు చేయవద్దని సూచించారు. వీటిని విక్రయించకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలన్నారు.

ప్రజాపాలనకు తరలి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ప్రతి వంద దరఖాస్తులకు ఒక కౌంటర్ ఏర్పాటు చేయాలన్నారు. పురుషులకు, మహిళలకు వేర్వేరు వరుసలు ఉండాలన్నారు. షామియానా, తాగునీటి సౌకర్యం ఉండాలని సూచించారు. ఆయా గ్రామ సభల షెడ్యూల్‌ను వారి వారి గ్రామాల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలన్నారు. అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.

  • Loading...

More Telugu News