Ambati Rayudu: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన క్రికెటర్ అంబటి రాయుడు

Cricketer Ambati Rayudu joins YSRCP
  • వైసీపీ తీర్థం పుచ్చుకున్న రాయుడు
  • తాడేపల్లిలో రాయుడికి వైసీపీ కండువా కప్పిన సీఎం జగన్
  • రాయుడి రాజకీయ రంగప్రవేశంపై గత కొన్ని నెలలుగా ప్రచారం

గత కొన్నినెలలుగా జరుగుతున్న ప్రచారమే నిజమైంది! ప్రముఖ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు వైసీపీలో చేరారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో రాయుడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. రాయుడికి సీఎం జగన్ పార్టీ కండువా కప్పి వైసీపీలోకి సాదరంగా స్వాగతం పలికారు. రాయుడ్ని ఆత్మీయంగా హత్తుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎంపీ మిథున్ రెడ్డి కూడా పాల్గొన్నారు. 

అంబటి రాయుడు గత ఐపీఎల్ సీజన్ ముగిసినప్పటి నుంచి రాజకీయాలపై ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. వైసీపీ కార్యక్రమాలకు హాజరవుతూ, తాను రాజకీయాల్లోకి వస్తున్నానన్న సంకేతాలు పంపారు. రాజకీయాల్లోకి వచ్చే అంశాన్ని ఎప్పుడూ ఖండించలేదు. అంతేకాదు, తాను ఏ పార్టీలో చేరతాననే విషయం నేరుగా ఎప్పుడూ చెప్పలేదు.

గత కొన్నినెలల వ్యవధిలో రాయుడు సీఎం జగన్ తో పలుమార్లు సమావేశమయ్యారు. ఎప్పుడు అడిగినా... సీఎంతో రాష్ట్రాభివృద్ధి అంశాలపై మాట్లాడానని రాయుడు చెప్పేవారు. ఇప్పుడు వైసీపీ కండువా కప్పుకోవడంతో ఆ ప్రచారానికి తెరపడింది. 

కాగా, రాయుడు గుంటూరు నుంచి లోక్ సభ ఎన్నికల బరిలో దిగుతారని కూడా కథనాలు వచ్చాయి. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News