Dean Elgar: ఎల్గార్ సెంచరీ... టీమిండియాపై దక్షిణాఫ్రికాకు స్వల్ప ఆధిక్యం

Dean Elgar makes century as SA edge past Team India 1st innings score
  • సెంచురియన్ లో తొలి టెస్టు
  • టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 245 ఆలౌట్
  • రెండో రోజు ఆట చివరికి 5 వికెట్లకు 256 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా
సెంచురియన్ టెస్టులో దక్షిణాఫ్రికా ఓపెనర్ డీన్ ఎల్గార్ సెంచరీ చేశాడు. ఎంతో ఓపికతో టీమిండియా బౌలర్లను ఎదుర్కొన్న ఈ సీనియర్ ఓపెనర్ ప్రస్తుతం 140 పరుగులతో క్రీజులో ఉన్నాడు. మొత్తం 211 బంతులెదుర్కొన్న ఎల్గార్ 23 బౌండరీలు కొట్టడం విశేషం. 

ఎల్గార్ కు మిడిలార్డర్ లో అరంగేట్రం కుర్రాడు డేవిడ్ బెడింగ్ హామ్ నుంచి చక్కని సహకారం లభించింది. బెడింగ్ హామ్ ఆడుతున్న తొలి టెస్టులోనే అర్ధసెంచరీ సాధించి ఆకట్టుకున్నాడు. బెడింగ్ హామ్ 87 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సులతో 56 పరుగులు చేశాడు. 

ఎల్గార్, బెడింగ్ హామ్ సెంచరీ భాగస్వామ్యంతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ను నడిపించారు. అయితే ఈ జోడీని సిరాజ్ ఓ చక్కని ఇన్ స్వింగర్ తో విడదీశాడు. అప్పటికి దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోరు 4 వికెట్లకు 244 పరుగులు. ఆ తర్వాత కాసేపటికే ప్రసిద్ధ్ కృష్ణ విజృంభించి సఫారీ వికెట్ కీపర్ కైల్ వెర్రీన్ (4) ను అవుట్ చేశాడు. దాంతో దక్షిణాఫ్రికా ఐదో వికెట్ కోల్పోయింది. టీమిండియా బౌలర్లలో బుమ్రా 2, సిరాజ్ 2, ప్రసిద్ధ్ 1 వికెట్ తీశారు. 

ఇక, రెండో రోజు ఆట చివరికి ఆతిథ్య జట్టు తొలి ఇన్నింగ్స్ స్కోరు 66 ఓవర్లలో 5 వికెట్లకు 256 పరుగులు. ఎల్గార్ కు జతగా మార్కో యన్సెన్ (3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. టీమిండియాపై ఆ జట్టు ఆధిక్యం 11 పరుగులు. టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 245 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
Dean Elgar
South Africa
Team India
1st Test
Centurion

More Telugu News