CM Jagan: క్రికెట్ కు సంబంధించి చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ముందుకొచ్చింది: సీఎం జగన్

  • ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలు
  • నేడు నల్లపాడులో ప్రారంభించిన సీఎం జగన్
  • ఈ క్రీడల ద్వారా గ్రామీణ ఆణిముత్యాలను వెలికితీస్తామన్న సీఎం జగన్
CM Jagan inaugurates Aadudam Andhra sports program

ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చిన ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలను సీఎం జగన్ ఇవాళ గుంటూరు జిల్లా నల్లపాడులో ప్రారంభించారు. ఇక్కడి లయోలా కాలేజీలో జరిగిన ప్రారంభోత్సవంలో ఆయన ప్రసంగించారు. 

ఆడుదాం ఆంధ్రా క్రీడా సంరంభం దేశ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుందని అన్నారు. ప్రతి ఒక్కరికీ వ్యాయామం అవసరమని, ఆడుదాం ఆంధ్రా ద్వారా ప్రతి గ్రామంలోనూ వ్యాయామం లభిస్తుందని తెలిపారు. ఈ క్రీడా కార్యక్రమం సచివాలయం, మండలం, నియోజకవర్గం, జిల్లా స్థాయిలో దశల వారీగా కొనసాగుతుందని... ఆ తర్వాత రాష్ట్రస్థాయిలో జరుగుతుందని సీఎం జగన్ వివరించారు. గ్రామాల్లో ఉన్న క్రీడా ఆణిముత్యాలను వెలుగులోకి తీసుకురావడమే ఈ ఆడుదాం ఆంధ్రా పోటీల ముఖ్య ఉద్దేశం అని స్పష్టం చేశారు. 

ఇక, క్రికెట్ కు సంబంధించి సహకారం అందించేందుకు ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ ముందుకొచ్చిందని సీఎం జగన్ వెల్లడించారు. ఇందులో ఆంధ్రా క్రికెట్ సంఘం కూడా పాలుపంచుకునేందుకు ఆసక్తి చూపిస్తోందని తెలిపారు. మెంటార్లుగా ఉంటూ మన పిల్లల ప్రతిభను గుర్తించడంతో పాటు, వారిని సానపట్టి వజ్రాలుగా మలచడంలో సహాయ సహకారాలు అందించేందుకు ముందుకు రావడం సంతోషకరమని వ్యాఖ్యానించారు.

More Telugu News