South Africa vs India Test series: కీలక మార్పులతో తొలి టెస్టులో దక్షిణాఫ్రికాను ఢీకొట్టబోతున్న టీమిండియా !

KL Rahul returns and 4 players dropped in indian squad against South Africa Tests
  • డబ్ల్యూటీసీ ఫైనల్, వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌ ఆడిన జట్టులో కీలక మార్పులతో బరిలోకి దిగబోతున్న భారత్
  • చాన్నాళ్ల తర్వాత టెస్టు ఆడబోతున్న కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా
  • సీనియర్లకు గాయాల కారణంగా పలువురు యువ ఆటగాళ్లకు జట్టులో చోటు దక్కే అవకాశం
మరికొన్ని గంటల్లో సెంచూరియన్ వేదికగా భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య 2 మ్యాచ్‌‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్ట్ ఆరంభం కానుంది. టీమిండియా గతంలో ఎప్పుడూ దక్షిణాఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్‌ను సాధించలేదు. దీంతో ఈసారి ఎలాగైనా చరిత్ర సృష్టించాలని భారత ఆటగాళ్లు ఉవ్విళ్లూరుతున్నారు. ఇందుకోసం సీనియర్లు, జూనియర్ల కలయికతో పటిష్ఠమైన టీమ్‌ సిద్దమైంది. కొన్ని నెలలక్రితం వెస్టిండీస్‌లో టెస్టు సిరీస్ ఆడిన జట్టుతో పోల్చితే ఈసారి కొన్ని కీలక మార్పులతో టీమిండియా బరిలోకి దిగబోతోంది. 

గాయాల నుంచి కోలుకున్న కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ 'బోర్డర్-గవాస్కర్' సిరీస్ తర్వాత మొదటిసారిగా టెస్ట్ మ్యాచ్ ఆడబోతున్నారు. టెస్టుల్లో వికెట్‌ కీపర్‌గా రాహుల్‌కు తొలి మ్యాచ్ కానుంది. జస్ప్రీత్ బుమ్రా కూడా చాలాకాలం తర్వాత తిరిగి టెస్టు సిరీస్‌ ఆడబోతున్నాడు. గతేడాది జులైలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ అతడికి చివరిది కాగా ఇప్పుడు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు. ఇక స్టార్ పేసర్ మహ్మద్ షమీ చీలమండ గాయం కారణంగా దూరమవ్వడంతో ప్రసిద్ధ్ కృష్ణకు టెస్టు స్క్వాడ్‌లో స్థానం దక్కింది. మరోవైపు చేతి వేలు గాయం కారణంగా జట్టుకు దూరమైన రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో అభిమన్యు ఈశ్వరన్‌ను బీసీసీఐ సెలక్టర్లు ఎంపిక చేశారు.

డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన అజింక్యా రహానేకు ప్రస్తుత జట్టులో చోటుదక్కలేదు. రహానే బ్యాటింగ్ చేసిన 5వ స్థానంలో శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్ చేయనున్నాడు. ఇక ఓపెనర్ చతేశ్వర్ పుజారాను కూడా సెలక్టర్లు పక్కనపెట్టారు. మరోవైపు మ్యాచ్‌లు దక్షిణాఫ్రికా గడ్డపై జరగనున్నందున అక్షర్ పటేల్‌ పేరును పరిగణనలోకి తీసుకోలేదు. ఇక వెస్టిండీస్‌పై తన అరంగేట్ర టెస్టులో అర్ధ శతకంతో రాణించిన ఇషాన్ కిషన్ ప్రస్తుతం విరామం తీసుకున్నాడు. అతడి స్థానంలో కేఎస్ భరత్‌ను టీమ్‌లోకి తీసుకున్నారు. పేసర్లు జయదేవ్ ఉనద్కత్, నవదీప్ సైనీ పేర్లను కూడా ప్రస్తుతం పరిగణనలోకి తీసుకోలేదు. అయితే స్టార్ పేసర్ మహ్మద్ షమీ స్థానంలో ఒకరిని జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.

భారత స్క్వాడ్
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మాన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అభిమన్యు ఈశ్వరన్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), ప్రసిద్ధ్ కృష్ణ.
South Africa vs India Test series
1st Test
Team New Zealand
Cricket
KL Rahul

More Telugu News