Nara Lokesh: యువ‌గ‌ళాన్ని నవశకం వైపు నడిపించిన అందరికీ పేరుపేరునా కృత‌జ్ఞ‌త‌లు: నారా లోకేశ్

Nara Lokesh express gratitude towards various sectors helped him during Yuvagalam
  • యువగళం పేరిట నారా లోకేశ్ పాదయాత్ర
  • 226 రోజుల పాటు  సాగిన యువగళం
  • కుప్పంలో మొదలై విశాఖలో ముగిసిన వైనం
  • పోలిపల్లి వద్ద విజయోత్సవ సభ
  • నేడు ఓ ప్రకటనలో పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపిన లోకేశ్ 
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర కుప్పంలో మొదలై విశాఖలో ముగిసింది. విజయనగరం జిల్లా పోలిపల్లి వద్ద యువగళం నవశకం పేరిట టీడీపీ నిర్వహించిన పాదయాత్ర విజయోత్సవ సభ ఘనంగా జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్, జనసేనాని పవన్ కల్యాణ్ ఈ సభ ద్వారానే ఒకే వేదికపైకి వచ్చారు.  యువగళం పాదయాత్ర ముగిసిన నేపథ్యంలో, నారా లోకేశ్ ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. 

"నా యువ‌గ‌ళంని న‌వ‌శ‌కం వైపు న‌డిపించిన ప్ర‌తీ ఒక్క‌రికీ హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు. వైసీపీ దుర్మార్గ పాల‌న‌పై ప్ర‌జ‌ల్ని చైత‌న్యం చేసే ల‌క్ష్యంతో కుప్పంలో జ‌న‌వ‌రి 27న ప్రారంభించి డిసెంబ‌ర్ 18న విశాఖ‌లో ముగిసే నాటికి మొత్తం 226 రోజులు పాటు మీరంతా నా వెంట న‌డిచారు, న‌న్ను న‌డిపించారు. 

పాద‌యాత్ర‌లో నేను చూసిన క‌ష్టాలు, గ్రామాల స‌మ‌స్య‌లు ప్ర‌జ‌ల ముందుంచ‌డంలో ప్ర‌ముఖ పాత్ర వ‌హించిన మీడియా యాజమాన్యాలు, జ‌ర్న‌లిస్టులు, సిబ్బంది, నా పీఆర్ టీమ్ కి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసుకుంటున్నాను. న‌న్ను కంటికి రెప్ప‌లా క‌నిపెట్టుకుని పాద‌యాత్ర‌లో సంయ‌మ‌నంతో విధులు నిర్వ‌ర్తించిన యువ‌గ‌ళం టీమ్‌, వ‌లంటీర్ల‌కి నా న‌మ‌స్కారాలు. 

న‌న్ను అడ్డుకోవాల‌ని ప్ర‌భుత్వం విప‌రీత‌మైన ఒత్తిడి చేసినా లొంగ‌కుండా యువ‌గ‌ళంలో బందోబ‌స్తు బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించిన‌ పోలీసుల‌కు న‌మ‌స్సులు. యువ‌గ‌ళం పాద‌యాత్ర ఇంత విజ‌య‌వంతం కావ‌డానికి కృషి చేసిన టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులు, టీడీపీ కార్యాల‌య సిబ్బంది, భ‌ద్ర‌తా సిబ్బంది, సాంకేతిక సిబ్బందితోపాటు ఈ మ‌హాప్ర‌యాణంలో భాగ‌మైన ప్ర‌తీ ఒక్క‌రికీ పేరుపేరునా కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసుకుంటున్నాను. 

97 నియోజ‌క‌వ‌ర్గాల‌లో ఏ ఊరువెళ్లినా, ఏ ప‌ట్ట‌ణంలో న‌డిచినా త‌మ వాడిగా ఆశీర్వ‌దించి, ఆద‌రించిన ప్ర‌జ‌ల‌కు నేను రుణ‌ప‌డి ఉంటాను. త్వ‌ర‌లో ఏర్ప‌డ‌బోయే ప్ర‌జా ప్ర‌భుత్వం ద్వారా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేసి ఇచ్చిన మాట నిల‌బెట్టుకుంటాన‌ని హామీ ఇస్తున్నాను" అని స్పష్టం చేశారు.
Nara Lokesh
Yuva Galam Padayatra
TDP
Andhra Pradesh

More Telugu News