Nawaz Sharif: మన దరిద్రానికి మనమే కారణం.. పాక్ ఆర్థిక పరిస్థితిపై నవాజ్ షరీఫ్

Nawaz Sharif Sensational Comments On Pakistan Economy
  • ఇండియా, అమెరికాలు కారణం కాదన్న మాజీ ప్రధాని
  • ప్రజలపై ప్రభుత్వాలను రుద్దొద్దంటూ ఆర్మీపై పరోక్ష విమర్శలు
  • ఆర్మీ నిర్ణయాలకు వంతపాడుతారంటూ జడ్జిలపై ఆరోపణలు

పాకిస్థాన్ దివాలా తీయడానికి కారణం ఇండియా, అమెరికాలు కాదంటూ ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ స్పష్టం చేశారు. మన దరిద్రానికి మనమే కారణమని సంచలన వ్యాఖ్యలు చేశారు. మన కాళ్లను మనమే నరుక్కున్నామంటూ పరోక్షంగా మిలట్రీపై తీవ్ర విమర్శలు చేశారు. 2018 ఎన్నికల్లో రిగ్గింగ్ జరిపి, వారికి (ఆర్మీ) నచ్చిన ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ప్రజల నెత్తిన రుద్దారని మండిపడ్డారు. దీంతో దేశం ఆర్థికంగా దివాలా తీసిందని, ప్రజలు కష్టాలపాలయ్యారని ఆరోపించారు. ఈమేరకు మంగళవారం తన పార్టీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

పాకిస్థాన్ ముస్లిం లీగ్- నవాజ్ (పీఎంఎల్-ఎన్) పార్టీ అధినేత నవాజ్ షరీఫ్.. పాక్ మూడుసార్లు ప్రధానిగా సేవలందించారు. జనవరిలో జరగనున్న ఎన్నికల్లో గెలిచి మరోసారి ప్రధాని కావాలని ఆశిస్తున్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో పీఎంఎల్- ఎన్ పార్టీ టికెట్ ఆశిస్తున్న వారితో ఆయన తాజాగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నవాజ్ మాట్లాడుతూ.. పాక్ ప్రస్తుత పరిస్థితికి, ప్రజల కష్టాలకు పక్క దేశాలు కారణం కాదని వ్యాఖ్యానించారు. 

దేశంలో న్యాయ వ్యవస్థ కూడా ఆర్మీకి వంత పాడుతుందని, ఆర్మీ నిర్ణయాలకు జడ్జిలు తలూపుతారని విమర్శించారు. రాజ్యాంగ అతిక్రమణ జరుగుతున్నా కల్పించుకోరని, పార్లమెంట్ రద్దు చేస్తున్నామని ఆర్మీ ప్రకటన చేయగానే జడ్జిలు ఆమోదముద్ర వేస్తారని నవాజ్ షరీఫ్ మండిపడ్డారు. ఇలాంటి నిర్ణయాలే దేశాన్ని అధోగతి పాలు చేశాయని, ప్రజలను మరింత కష్టాల్లోకి నెట్టాయని షరీఫ్ ఆరోపించారు.

  • Loading...

More Telugu News