Mallikarjun Kharge: విపక్షాల ప్రధానమంత్రి అభ్యర్థిగా మల్లికార్జున ఖర్గే... ప్రతిపాదించిన మమతా బెనర్జీ

Mamata proposes Mallikarjun Kharge as opposition PM Candidate in next elections
  • ఢిల్లీలో నేడు ఇండియా కూటమి సమావేశం
  • ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా ఖర్గే పేరును ప్రస్తావించిన మమత
  • దీదీ ప్రతిపాదనకు 12 పార్టీల మద్దతు
  • సున్నితంగా తోసిపుచ్చిన ఖర్గే... ముందు ఎన్నికల్లో గెలవాలని వ్యాఖ్యలు

ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి సమావేశమైంది. ఈ సమావేశంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. వచ్చే ఎన్నికల్లో విపక్షాల ప్రధానమంత్రి అభ్యర్థిగా మల్లికార్జున ఖర్గే పేరును బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రతిపాదించారు. 

లోక్ ఎన్నికల తర్వాతే తమ ప్రధాని అభ్యర్థిని ప్రకటిస్తామని నిన్న చెప్పిన మమత, ఒక్కరోజులోనే స్వరం మార్చేశారు! ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి ఖర్గే అంటూ నేటి సమావేశంలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఖర్గే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. 

కాగా, మమత ప్రతిపాదనకు ఇండియా కూటమిలో 12 పార్టీల నుంచి మద్దతు లభించింది. అంతేకాదు, ఊహించని రీతిలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించారు. దేశానికి తొలి దళిత ప్రధానిని అందించేందుకు ఇదొక మంచి అవకాశం అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. కర్ణాటకకు చెందిన మల్లికార్జున ఖర్గే దళిత వర్గానికి చెందిన వ్యక్తి అని తెలిసిందే. 

అయితే, ఈ ప్రతిపాదనకు ఖర్గే నుంచే వ్యతిరేకత వ్యక్తం కావడంతో మమతా బెనర్జీ సహా ఇతర విపక్ష నేతలు నిరాశకు గురయ్యారు. మమత ప్రతిపాదనను ఖర్గే సున్నితంగా తోసిపుచ్చారు. తాను అణగారిన వర్గాల కోసం పనిచేయాలని మాత్రమే కోరుకుంటున్నానని స్పష్టం చేశారు. 

"మొదట మనం ఎన్నికల్లో గెలవాలి. గెలవడానికి ఏం చేయాలన్నదాని గురించే ఇప్పుడు ఆలోచించాలి. అసలు మనకు ఎంపీలే లేకుండా ప్రధాని పదవి గురించి ఆలోచించడంలో అర్థమేముంది? ముందు మనం ఐకమత్యంతో కృషి చేసి మెజారిటీ పొందాలి" అంటూ ఖర్గే వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News