Roja: ఎవరికైనా సీటు రాకపోతే అది వారి పొరపాటే: మంత్రి రోజా

Minister Roja explains seat allotment issue
  • ఇటీవల 11 నియోజకవర్గాలకు ఇన్చార్జిలను మార్చిన జగన్
  • కష్టపడి పనిచేసేవారికి సీట్లు ఎక్కడికీ పోవని రోజా వెల్లడి
  • ప్రజల్లో ఉండాలని జగన్ చెబుతున్నారన్న రోజా
  • ఇంకొందరు సీట్లు రావని వాళ్లకై వాళ్లే ఊహించుకుంటున్నారని వ్యాఖ్యలు

ఇటీవల ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలోని 11 నియోజకవర్గాలకు ఇన్చార్జిలను మార్చిన సంగతి తెలిసిందే. పలువురు మంత్రులు కూడా ఈసారి ఇతర నియోజకవర్గాల నుంచి పోటీ చేయాల్సిన పరిస్థితి ఉందని సీఎం నిర్ణయంతో స్పష్టమైంది. దీనిపై ఏపీ మంత్రి రోజా స్పందించారు. 

ప్రజల్లో ఉంటూ కష్టపడి పనిచేసిన వారికి సొంత నియోజకవర్గం సీట్లు ఎక్కడికీ పోవని, వారి సీట్లు వారికే ఉంటాయని అన్నారు. మంత్రుల విషయానికొస్తే, తమ నియోజకవర్గంలో బలంగా ఉంటారు కాబట్టి, ఒకవేళ వారిని ఇతర నియోజకవర్గానికి మార్చినా ఆ రెండు నియోజకవర్గాల్లో గెలిపించే బాధ్యత ఆ మంత్రులకు అప్పగించడం అనేది అందరికీ తెలిసిందేనని వివరించారు. 

"ఇక ఎవరికైనా ఈసారి ఎన్నికల్లో సీటు లేదు అంటే అది వారి పొరపాటే అవుతుంది. నాలుగున్నర సంవత్సరాలు మనకు అవకాశం ఇచ్చారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ప్రజల వద్దకు వెళ్లే గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం గురించి సీఎం జగన్ చిన్న పిల్లలకు చెప్పినట్టు చెప్పారు... నాకు మిమ్మల్ని ఎవర్నీ వదులుకోవడం ఇష్టంలేదని, మనం అందరం కలిసి ప్రయాణం చేద్దాం అని చెప్పారు. నా వరకు నేను ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఎంత కష్టమైనా కూడా నెరవేర్చేందుకు కృషి చేస్తున్నాను... ఎక్కడా ఎవరికీ ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాను... మీరు కూడా మీ మీ నియోజకవర్గాల్లో మీపై చెడు అభిప్రాయం లేకుండా చూసుకోండి... ప్రజల్లో ఉండండి అని జగన్ చెప్పారు. 

ఇక దీనికి సంబంధించి సర్వేలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఎవరికైనా సీటు మిస్ అయిందీ అంటే అది వారి పొరపాటే అవుతుంది తప్ప జగన్ మోహన్ రెడ్డి గారి పొరపాటు కాదు. కొందరు తమకు సీట్లు రాలేదని వాళ్లకై వాళ్లే ఊహించుకుంటే మనమేం చేయలేం. ఏదైనా మార్పులు చేర్పులు చేయాల్సి వస్తే వాళ్లను పిలిచి రెండు మూడు పర్యాయాలు చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటున్నారు తప్ప... ఎక్కడా కూడా గుడ్డిగా మార్పులు చేయడం లేదు" అంటూ మంత్రి రోజా వివరించారు.

  • Loading...

More Telugu News