Nara Lokesh: పైలాన్ ఆవిష్కరించి యువగళం పాదయాత్రను ముగించిన నారా లోకేశ్

Nara Lokesh ends his Yuvagala Padayatra
  • జనవరి 27న కుప్పంలో ప్రారంభమైన లోకేశ్ యువగళం
  • 226 రోజుల పాటు సాగిన పాదయాత్ర
  • అగనంపూడి వద్ద పైలాన్ ఆవిష్కరణ
  • నియంతృత్వంపై ప్రజా యుద్ధమే యువగళం అని నినదించిన లోకేశ్

జనవరి 27న ప్రారంభమై 226 రోజుల పాటు కొనసాగిన నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నేటితో ముగిసింది. విశాఖ జిల్లా అగనంపూడిలో పైలాన్ ఆవిష్కరించిన లోకేశ్ తన సుదీర్ఘ పాదయాత్రకు ముగింపు పలికారు. అంతకుముందు లోకేశ్ భారీ ర్యాలీగా తరలివచ్చారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన టీడీపీ, జనసేన శ్రేణులతో గాజువాక జనసంద్రమైంది. 

పైలాన్ ఆవిష్కరించిన అనంతరం లోకేశ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో నియంతృత్వంపై ప్రజా యుద్ధమే యువగళం అని స్పష్టం చేశారు. అణచివేతకు గురైన వర్గాలకు యువగళం గొంతుక అయిందని అన్నారు. యువగళం ప్రజాగళమై నిర్విరామంగా సాగిందని లోకేశ్ పేర్కొన్నారు. ఒక అసమర్థుడు గద్దెనెక్కి ప్రజాస్వామ్యంపై దాడి చేశాడని విమర్శించారు. ప్రజాస్వామ్యంపై, వ్యవస్థలపై జరిగిన దాడిని కళ్లారా చూశానని అన్నారు.

రాష్ట్రంలో భవిష్యత్తుపై ఆశలు కోల్పోయిన యువతకు యువగళం ద్వారా భరోసా ఇచ్చానని తెలిపారు. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీకి కట్టుబడి ఉంటానని లోకేశ్ ఉద్ఘాటించారు. యువగళం పాదయాత్రలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు. 

కాగా, లోకేశ్ తన పాదయాత్రలో మొత్తం 3,132 కిలోమీటర్లు నడిచారు. 97 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా యువగళం సాగింది. తారకరత్న మృతి, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్, చంద్రబాబు అరెస్ట్ వంటి కొన్ని ఘటనల వల్ల పాదయాత్రకు మధ్యలో విరామం ఇచ్చారు.

  • Loading...

More Telugu News