Michael Vaughan: ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో పాక్ ఘోర పరాజయం.. టీమిండియాపై మైఖేల్ వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Michael Vaughan Praises BCCI And Team India
  • పాక్‌పై 360 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం
  • ఆస్ట్రేలియాను సొంతగడ్డపై ఢీకొట్ట గలిగే జట్టు భారత్ ఒకటేనన్న మైఖేల్ వాన్
  • బీసీసీఐ నాణ్యమైన క్రికెటర్లను అందిస్తోందని ప్రశంస
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో పాకిస్థాన్ ఘోర పరాభవం తర్వాత ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ టీమిండియాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో తలపడగలిగే జట్టు భారత్ తప్ప మరేదీ కాదని స్పష్టం చేశాడు. పాకిస్థాన్‌పై అద్భుత విజయం సాధించిందని, అన్ని విభాగాల్లో ఆధిపత్యం ప్రదర్శించిందని పేర్కొన్నాడు. నాథన్ లయన్ 500 వికెట్ల క్లబ్‌లోకి చేరడాన్ని అభినందించాడు.

ఆస్ట్రేలియాను వారి దేశంలో ఢీకొట్టే జట్టు ఏదైనా ఉందంటే అది ఒక్క భారత జట్టు మాత్రమేనని తేల్చి చెప్పాడు. బీసీసీఐ నాణ్యమైన క్రికెటర్లను అందిస్తోందని ప్రశంసించింది. వాన్ వ్యాఖ్యలపై టీమిండియా అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 

ఆస్ట్రేలియాకు భారత్ పోటీ ఇస్తుందనేదానికంటే ఓడించగలదంటే బాగుంటందని కామెంట్ చేస్తున్నారు. ఆసీస్ అద్భుతంగా ఆడిందని, వార్నర్ చివరి సిరీస్‌లో విశేషంగా రాణించాడని ప్రశంసించారు. ఇక, పాకిస్థాన్ జట్టు పోటీ ఇవ్వకుండానే చేతులెత్తేసిందని మరికొందరు విమర్శించారు.

కాగా, పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా 360 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 487 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌ను 233/5 వద్ద డిక్లేర్ చేసింది. ప్రతిగా తొలి ఇన్నింగ్స్‌లో 271 పరుగులకు ఆలౌట్ అయిన పాకిస్థాన్.. రెండో ఇన్నింగ్స్‌లో 89 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని అందుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో వార్నర్ 164 పరుగులతో భారీ సెంచరీ నమోదు చేశాడు.
Michael Vaughan
Team India
Australia
Pakistan

More Telugu News