Surat Building: ప్రపంచంలోనే అతిపెద్ద ఆఫీస్ బిల్డింగ్ ను ప్రారంభించిన మోదీ.. వీడియోలు ఇవిగో!

Prime Minister Modi Inaugurate The Diamond Bourse Built In Surat
  • గుజరాత్ లో సరికొత్త డైమండ్ ప్రపంచం ‘సూరత్ డైమండ్ బోర్స్’
  • 700 ఎకరాల్లో ఒక్కొక్కటి 15 అంతస్తుల 9 టవర్ల నిర్మాణం
  • అన్నీ ఒకదానితో మరొకటి కనెక్ట్ చేస్తూ కట్టిన భవనం
  • 4,200 ఆఫీసుల్లో 67 వేల మంది ఉద్యోగులు
  • అమెరికాలోని పెంటగాన్ భవనం రికార్డును చెరిపేసిన బిల్డింగ్
ప్రపంచంలోనే అతిపెద్ద కార్పొరేట్ ఆఫీస్ బిల్డింగ్ ను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. గుజరాత్ లోని సూరత్ లో నిర్మించిన ‘సూరత్ డైమండ్ బోర్స్’ భవనాన్ని సీఎం భూపేంద్ర పాటిల్ తో కలిసి ప్రారంభోత్సవం చేశారు. ఈ భవనం సూరత్ లో సరికొత్త డైమండ్ ప్రపంచాన్ని సృష్టించనుంది. ముడి వజ్రాల నుంచి వజ్రాభరణాల దాకా అన్ని రకాల వ్యాపారాలు నిర్వహించేలా ఇందులో ఏర్పాట్లు చేశారు. ముంబై నుంచి డైమండ్ వ్యాపారం మొత్తం సూరత్ కు షిఫ్ట్ అయ్యేలా ఈ బిల్డింగ్ నిర్మాణం జరిగింది.

ఇప్పటి వరకు ప్రపంచంలోనే అతిపెద్ద ఆఫీస్ స్పేస్ గా అమెరికాలోని పెంటగాన్ పేరొందింది. తాజాగా ఈ ఘనతను సూరత్ డైమండ్ బోర్స్ దక్కించుకుంది. ఈ బిల్డింగ్ ను దాదాపు 700 ఎకరాల్లో నిర్మించారు. మొత్తం తొమ్మిది టవర్లు.. ఒక్కోటీ పదిహేను అంతస్తులతో ఒకదానిని మరొకటి కనెక్ట్ చేస్తూ కట్టారు. ఇందులో మొత్తం 4,200 ఆఫీసులు, 67 వేల మంది ఉద్యోగులు పనిచేసుకోవచ్చు. అంతర్జాతీయ వజ్రాభరణాల వ్యాపారానికి ఇది ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ఆధునిక కేంద్రం కాబోతోంది.

ఈ భవనంలో 175 దేశాల నుంచి 4వేల మందికి పైగా వ్యాపారులు తమ కార్యకలాపాలను నిర్వహించనున్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా డైమండ్‌ బోర్స్‌ ద్వారా లక్షన్నర మందికి ఉపాధి లభించబోతోంది. ఇందులో మొత్తం 27 ఆభరణాల దుకాణాలను ఏర్పాటు చేశారు. మొత్తం 4 వేలకు పైగా సీసీటీవీ కెమెరాలతో నిరంతరం నిఘా ఉంటుంది. బయోమెట్రిక్ విధానం ద్వారా ఉద్యోగులు, సిబ్బంది రాకపోకలు సాగించవచ్చు.

బిల్డింగ్ కీలక ఫీచర్లు
  • డైమండ్ రీసెర్చ్ అండ్ మెర్కంటైల్ (డ్రీమ్) సిటీగా వ్యవహరించే ఈ బిల్డింగ్ ను మొత్తం 66 లక్షల స్క్వేర్ ఫీట్లలో నిర్మించారు.
  • అమెరికాలోని పెంటగాన్ కన్నా సూరత్ డైమండ్ బోర్స్ పెద్దది. 
  • మార్ఫోజెనిసిస్ అనే కంపెనీ ఈ బిల్డింగ్ ను డిజైన్ చేసింది.
  • 4,200 ఆఫీసులు ఒక్కోటీ 300 స్క్వేర్ ఫీట్ నుంచి 75 వేల స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణంలో ఉన్నాయి.
  • ఒక్కోటి 15 అంతస్తుల టవర్లు మొత్తం 9 ఉన్నాయి. అన్నీ ఒకదానితో మరొకటి ఇంటర్ కనెక్ట్. 131 హైస్పీడ్‌ లిఫ్ట్‌లను ఏర్పాటు చేశారు.
  • ఈ బిల్డింగ్ లో ముడి వజ్రాల నుంచి మొదలుకొని పాలిష్డ్ వజ్రాల దాకా.. డైమండ్ మానుఫ్యాక్షరింగ్ మెషిన్ల నుంచి సాఫ్ట్ వేర్ల దాకా, డైమండ్ సర్టిఫికెట్ సంస్థల నుంచి ల్యాబ్ లో తయారు చేసిన డైమండ్ల దాకా.. ఒకటేమిటి మొత్తం డైమండ్లకు సంబంధించిన సమస్త వ్యాపారం ఇక్కడే ఉంటుంది.
  • మొత్తం 27 వజ్రాభరణాల రిటైల్ దుకాణాలతో పాటు దేశీయ, విదేశీ కొనుగోలుదారుల కోసం డైమండ్ జ్యువెలరీ షాప్ కూడా ఏర్పాటు చేయనున్నారు.
  • సెక్యూరిటీ విషయానికి వస్తే.. మొత్తం 4 వేల కెమెరాలతో బిల్డింగ్ మొత్తం నిరంతరం నిఘా ఉంటుంది. ఉద్యోగులు, సిబ్బంది రాకపోకలు మొత్తం బయోమెట్రిక్ విధానంలో జరుగుతాయి.

Surat Building
Diamond Bourse
PM Modi
Builing Inauguration
World biggest building
Pentagan

More Telugu News