Hardik Pandya: హార్దిక్ పాండ్యా ఆ కండీషన్ పైనే ముంబయి ఇండియన్స్ కు వచ్చాడా?

National media story on Hardik Pandya appointment as MI Skipper
  • ముంబయి ఇండియన్స్ కెప్టెన్ గా రోహిత్ శర్మ తొలగింపు
  • గుజరాత్ టైటాన్స్ నుంచి తీసుకువచ్చిన హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ అప్పగింత
  • తాజాగా 'ఇండియన్ ఎక్స్ ప్రెస్' లో ఆసక్తికర కథనం 
ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్ రోహిత్ శర్మకు గౌరవంగా తప్పుకునే అవకాశం ఇస్తారని అందరూ భావించారు. కానీ, ముంబయి ఇండియన్స్ యాజమాన్యం అనూహ్యరీతిలో రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి, గుజరాత్ టైటాన్స్ నుంచి తీసుకువచ్చిన హార్దిక్ పాండ్యాను కొత్త కెప్టెన్ గా నియమించింది. ఈ

 హఠాత్ పరిణామం క్రికెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. అభిమానులైతే మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ మీడియాలో ఓ ఆసక్తికర కథనం వచ్చింది. 

తనను ముంబయి ఇండియన్స్ కు కెప్టెన్ గా నియమించే షరతుపైనే హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ ను వీడి వచ్చాడని 'ఇండియన్ ఎక్స్ ప్రెస్' మీడియా సంస్థ తన కథనంలో పేర్కొంది. 

ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ కు రెండు సీజన్ల పాటు కెప్టెన్ గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా తొలి సీజన్ లోనే టైటిల్ అందించగా, రెండోసారి ఫైనల్ వరకు జట్టును తీసుకెళ్లాడు. కెప్టెన్ గా తానేంటో నిరూపించుకున్నాడు. ఇప్పుడు మరలా ముంబయి ఇండియన్స్ కు వచ్చి సాధారణ ఆటగాడిలా ఉండాలని తాను కోరుకోవడంలేదని పరోక్షంగా ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీకి హార్దిక్ పాండ్యా స్పష్టం చేసినట్టు సదరు కథనంలో పేర్కొన్నారు. 

కాగా, కెప్టెన్సీ మార్పు అంశం రోహిత్ శర్మకు వరల్డ్ కప్ జరిగే సమయంలోనే ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ తెలియజేసినట్టు కూడా ఆ కథనంలో తెలిపారు.
Hardik Pandya
Captain
Mumbai Indians
Gujarat Titans

More Telugu News