Ladakh: లడఖ్ మాదే.. మరోసారి స్పష్టం చేసిన చైనా

  • జమ్మూకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దును సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పు
  • తాజా పరిణామంపై చైనా స్పందన
  • భారత సుప్రీం కోర్టు తీర్పు వాస్తవాన్ని మార్చదని వ్యాఖ్య
China reiterates claims over Ladakh says never recognised the so called Union Territory

జమ్మూకశ్మీర్‌ ప్రత్యేక ప్రతిపత్తి రద్దును సమర్థిస్తూ భారత సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించిన నేపథ్యంలో చైనా తాజాగా స్పందించింది. లడఖ్ తమదేనని మరోసారి ప్రకటించింది. భారత్-చైనా సరిహద్దుకు పశ్చిమాన ఉన్న ప్రాంతం ఎప్పటికీ చైనా భూభాగమేనని స్పష్టం చేసింది. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మీడియాతో కీలక వ్యాఖ్యలు చేశారు. 

‘‘లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాన్ని మేము ఎప్పుడూ గుర్తించలేదు. ఏకపక్షంగా, చట్టవ్యతిరేకంగా భారత్ ఈ ప్రకటన చేసింది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. భారతీయ కోర్టు ఇచ్చిన అంతర్గత తీర్పు వాస్తవాన్ని మార్చదని చైనా రాయబారి వ్యాఖ్యానించారు. చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వ్యాఖ్యలపై భారత్ ఇంకా స్పందించాల్సి ఉంది. 

కాగా, జమ్మూకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దును చైనా 2019లోనూ వ్యక్తిరేకించింది. ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూకశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాల ఏర్పాటు ఆమోదయోగ్యం కాదని అప్పట్లోనే తేల్చి చెప్పింది.

More Telugu News