Wife Suicide: భార్య ఉరి వేసుకుంటుంటే ఆపకుండా వీడియో తీసిన భర్త.. హైదరాబాద్ లో దారుణం

Hyderabad Husband Took Video Of Wife Committing Suicide
  • తాగుడు అలవాటు మానుకోకుంటే చనిపోతానని భార్య బెదిరింపు
  • మద్యం మత్తులో ఆ మాటలు పట్టించుకోని భర్త
  • అన్నంత పనీ చేసిన మహిళ.. అనాథలుగా మారిన పిల్లలు
కళ్ల ముందే భార్య ఉరేసుకుంటుంటే ఆపాల్సింది పోయి రెచ్చగొట్టాడో భర్త.. మద్యం మత్తులో భార్య ఆత్మహత్యను ఫోన్ లో రికార్డు చేశాడు. దీంతో భర్త కళ్ల ముందే తనువు చాలించిందా భార్య.. తల్లి చనిపోవడం, తండ్రి జైలుకెళ్లడంతో పిల్లలు అనాథలుగా మారారు. ఈ అమానుష ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిటీలోని మురాద్ నగర్ సయ్యద్ అలీగూడలో రసూల్, ఆర్షియా బేగం దంపతులు నివాసం ఉంటున్నారు. ఐదేళ్ల క్రితం వీరికి వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. రసూల్ కు అప్పటికే వివాహం అయినప్పటికీ విషయం దాచి ఆర్షియాను పెళ్లి చేసుకున్నాడు. ఈ మోసానికి తోడు నిత్యం తాగుతూ గొడవపడుతుండడంతో ఆర్షియా విసిగిపోయింది. 

తాగుడు మానేయాలంటూ ఆర్షియా తరచూ భర్తను పోరేది. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరుగుతూనే ఉండేవని స్థానికులు చెప్పారు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి కూడా రసూల్, ఆర్షియా గొడవపడ్డారు. భర్త తీరుతో విసిగిపోయిన ఆర్షియా.. మద్యం మానేయకుంటే ఉరి వేసుకుంటానని రసూల్ ను బెదిరించింది. ఇలాగైనా భర్త తాగుడు మానేస్తాడని ఆశపడింది. అయితే, అప్పటికే మద్యం మత్తులో ఉన్న రసూల్ భార్య మాటలను లెక్కచేయలేదు. పైపెచ్చు రెచ్చగొట్టినట్లు మాట్లాడడంతో ఆర్షియా విరక్తి చెందింది.

భర్త కళ్లముందే ఫ్యాన్ కు చున్నీ బిగించి మెడకు తగిలించుకుంది. అయినా రసూల్ ఆపకపోగా తన ఫోన్ లో ఇదంతా రికార్డు చేశాడు. దీంతో భర్త కళ్లెదురుగానే గిలగిలా కొట్టుకుంటూ ఆర్షియా ప్రాణాలు విడిచింది. ఆర్షియా తనను బెదిరించడానికే చేస్తోందని వీడియో తీశానని, నిజంగా చనిపోతుందని అనుకోలేదంటూ రసూల్ పోలీసుల ముందు వాపోయాడు. అయితే, ఆర్షియా ఆత్మహత్యకు పాల్పడుతున్నా ఆపనందుకు రసూల్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆత్మహత్యకు ప్రేరేపించడం నేరమేనని స్పష్టం చేశారు.
Wife Suicide
Infront of Husband
video record
Hyderabad
Husband arrest

More Telugu News