KCR: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ హామీలను నెరవేరుస్తుంది: వి.హనుమంతరావు

V Hanumantha Rao allegations on congress
  • పదేళ్లలో బీఆర్ఎస్ అందరినీ మోసం చేసిందని ఆగ్రహం
  • కేసీఆర్ దళితుడిని సీఎంగా చేస్తానని ఎన్నికలకు ముందు చెప్పి మాట తప్పారని విమర్శ
  • రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడంపై కిషన్ రెడ్డి మాట్లాడాలని వ్యాఖ్య
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తుందని, ఇప్పటికే రెండు హామీలను అమలు చేస్తున్నామని ఆ పార్టీ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు అన్నారు. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... పదేళ్లలో బీఆర్ఎస్ అందరినీ మోసం చేసిందని ఆరోపించారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ నేతలను ఇబ్బంది పెట్టిందని మండిపడ్డారు. కేసీఆర్ దళితుడిని సీఎంగా చేస్తానని ఎన్నికలకు ముందు చెప్పారని, కానీ చేయలేదని గుర్తు చేశారు. కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి... కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను అమలు చేయదని అన్నారని, కానీ కర్ణాటక వెళ్లి ఆయన చూడాలని సూచించారు.

 కేంద్ర ప్రభుత్వం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిందని, కానీ ఆ అంశంపై కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదు? అని నిలదీశారు. మహిళలకు తాము ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కాంగ్రెస్ కల్చర్ అన్నారు. కాంగ్రెస్ పేదలకు భూములు ఇస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని తీసుకుందని ఆరోపించారు. కేవలం ధనవంతులకు మాత్రమే బీఆర్ఎస్ న్యాయం చేసిందని, కేసీఆర్ ఇంటికో ఉద్యోగం, మూడెకరాల భూమి అన్నారు కానీ వాటిని నెరవేర్చలేదన్నారు. ధరణి పోర్టల్ ద్వారా భూములు లాగేశారని.. దానిని రద్దు చేయాల్సిందే అన్నారు. రెవెన్యూ శాఖలో తప్పులు జరిగాయని విమర్శించారు. ప్రభుత్వం పడిపోతుందనే ప్రకటన సరికాదన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు అలాంటి వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు 
KCR
Telangana
Revanth Reddy
V Hanumantha Rao

More Telugu News