APAAR Card: వన్ నేషన్.. వన్ స్టూడెంట్.. కేంద్రం కొత్త ఐడీ

Union Education Ministry New Initiation APAAR CARD For Students In India
  • దేశంలోని విద్యార్థులందరికీ ఒకే గుర్తింపు ‘అపార్ కార్డు’
  • అకడమిక్ వివరాల డిజిటలైజేషన్ ప్రారంభించిన విద్యాశాఖ
  • ప్రీ ప్రైమరీ నుంచి పీజీ చదివే విద్యార్థుల దాకా కార్డు జారీ
భారత పౌరులు అందరికీ ఒకే గుర్తింపు ‘ఆధార్ కార్డు’ తరహాలో దేశంలోని విద్యార్థులు అందరికీ ఒకే ఐడీ జారీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ (ఆపార్ కార్డ్) ను మొదలుపెట్టింది. జాతీయ విద్యావిధానం 2020లో భాగంగా విద్యార్థులకు ఈ కొత్త ఐడీని జారీ చేస్తోంది. వన్ నేషన్, వన్ స్టూడెంట్ ఐడీ కార్డుగా దీనిని వ్యవహరిస్తారు. దీంతో విద్యార్థులకు సంబంధించిన అన్ని వివరాలు అంటే.. డిగ్రీలు, రివార్డులు, స్కాలర్ షిప్ లు, క్రెడిట్ లు సహా పూర్తి అకడమిక్ డేటాను డిజిటలైజేషన్ చేయనున్నారు. విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉండే ఈ వ్యవస్థను ఎడ్యు లాకర్ గా సూచిస్తున్నారు.

విద్యార్థులకు ప్రయోజనం..
ఆపార్ కార్డు.. దేశంలోని అన్ని ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు అందించబోయే డిజిటల్ ఐడీ. అకడమిక్ వివరాలన్నీ డిజిటలైజేషన్ చేయడం వల్ల ఆన్ లైన్ లో తమ వివరాలను అవసరమైనపుడు చూసుకోవడం, డౌన్ లోడ్ చేసుకోవడం సాధ్యపడుతుంది. విద్యార్థులకు సంబంధించిన ట్రాక్ రికార్డును నమోదు చేయవచ్చు. దీంతో ఒక పాఠశాల నుంచి మరో పాఠశాలకు బదిలీ సులభం కానుంది. ప్రీ ప్రైమరీ నుంచి పీజీ చదువుతున్న విద్యార్థుల దాకా.. అన్ని పాఠశాలలు, కళాశాలలు ఈ కార్డును జారీ చేస్తాయి. 

రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఇలా..
  • అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ వెబ్ సైట్ లోకి లాగిన్ అయి మై అకౌంట్ పై క్లిక్ చేసి స్టూడెంట్ ను ఎంపిక చేయాలి.
  • డిజిలాకర్ ఖాతా తెరిచి మొబైల్, చిరునామా, ఆధార్ కార్డు వివరాలను నమోదు చేయాలి.
  • కేవైసీ ధ్రువీకరణ పూర్తిచేసి పాఠశాల, యూనివర్సిటీ పేరు, తరగతి, కోర్సు పేరు తదితర అకడమిక్ వివరాలను నమోదు చేసుకోవాలి.
  • ఫారమ్ ను సబ్మిట్ చేస్తే ఆపార్ కార్డు తయారవుతుంది.

రిజిస్ట్రేషన్ కు ఈ వివరాలు తప్పనిసరి..
1. ఆధార్ కార్డు
2. డిజిలాకర్ లో ఖాతా (కేవైసీ కోసం)
3. అపార్ కార్డు జారీకి తల్లిదండ్రుల అనుమతి (ఒకసారి సమ్మతించినా సరే తర్వాత తల్లిదండ్రులు తమ సమ్మతిని ఉపసంహరించుకోవచ్చు)
4. తల్లిదండ్రుల సమ్మ తి పొందిన తర్వాతే పాఠశాలు అపార్ ఐడీ కార్డును జారీ చేస్తాయి.

డౌన్ లోడ్ చేసుకోవడమెలా?
విద్యార్థులు అపార్ రిజిస్ట్రేషన్ తర్వాత కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ కార్డు 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కలిగి ఉంటుంది. ఇందులో తమ అకడమిక్ రికార్డులను పొందుపర్చుకోవచ్చు. ఈ కార్డు విద్యార్థుల ఆధార్ కార్డుతో లింక్ చేయబడుతుంది. అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ వెబ్ సైట్ లో లాగిన్ అవ్వాలి. డ్యాష్ బోర్డులో అపార్ కార్డ్ డౌన్ లోడ్ పై క్లిక్ చేయాలి. దీంతో స్క్రీన్ పై మీ అపార్ కార్డు కనిపిస్తుంది. డౌన్ లోడ్ లేదా ప్రింట్ క్లిక్ చేయడం ద్వారా అపార్ కార్డు డౌన్ లోడ్ అవుతుంది. 

ప్రయోజనాలు
  • విద్యార్థుల జీవితకాల గుర్తింపు కార్డుగా ఉపయోగపడుతుంది.
  • అకడమిక్ డేటాను ఒకేచోట నిల్వచేస్తుంది.
  • దేశంలోని ఏ ప్రాంతంలోనైనా, ఏ కొత్త సంస్థలలోనైనా ప్రవేశం పొందడం చాలా సులభం. విద్యార్థుల డ్రాపవుట్లను గుర్తించి వారిని తిరిగి పాఠశాలలో చేర్పించవచ్చు.
APAAR Card
New ID
Students
Edulacker
Acadamic Details
One nation One Student

More Telugu News