Kishan Reddy: పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి నేను అలాంటి వ్యాఖ్యలు చేయలేదు: కిషన్ రెడ్డి

I never spoke against Pawan Kalyan says Kishan Reddy
  • జనసేనతో పొత్తు వల్ల బీజేపీకి నష్టం కలిగిందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించినట్టు ప్రచారం
  • పొత్తు లేకపోతే గ్రేటర్ లో మరో 5 స్థానాలు వచ్చుండేవని అన్నట్టు వార్తలు వైరల్
  • ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దన్న కిషన్ రెడ్డి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన 8 స్థానాల్లోనూ ఓటమిపాలయింది. బీజేపీ కేవలం 8 స్థానాల్లోనే గెలుపొందింది. మరోవైపు, తెలంగాణలో బీజేపీ ఓటమికి జనసేన కారణమంటూ కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారంటూ ఓ వార్త వైరల్ అవుతోంది. జనసేన వల్లే బీజేపీ ఇంతటి ఘోర పరాజయాన్ని మూటకట్టుకుందని కిషన్ రెడ్డి అన్నట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 

పవన్ ను నమ్ముకుని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నష్టపోయామని... పొత్తు లేకపోతే గ్రేటర్ లో మరో 4 నుంచి 5 సీట్లు వచ్చేవని కిషన్ రెడ్డి అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. దీనిపై కిషన్ రెడ్డి స్పందిస్తూ... ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పారు. కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు పార్టీల మధ్య పొత్తు అనేది ఒకరిద్దరు తీసుకున్న నిర్ణయం కాదని... ఇరు పార్టీలు ఎంతో ఆలోచించి తీసుకున్న నిర్ణయమని చెప్పారు. ఇలాంటి వార్తలు నమ్మొద్దని... ఉద్దేశపూర్వకంగా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
Kishan Reddy
BJP
Pawan Kalyan
Janasena
Telangana
Telangana Assembly Election

More Telugu News