Vishnu Deo Sai: ఛత్తీస్‌గఢ్ సీఎంగా విష్ణు దియో సాయిని ఎంపిక చేసిన బీజేపీ!

Tribal Leader Vishnu Deo Sai Is New Chhattisgarh Chief Minister
  • ఆదివారం జరిగిన రాష్ట్ర శాసనసభా పక్ష సమావేశంలో నిర్ణయం
  • గిరిజన నేతను సీఎం చేయాలన్న మోదీ సంకల్పం ప్రకారం ఎంపిక జరిగిందన్న పార్టీ వర్గాలు
  • గిరిజన ప్రాంతాల్లో బీజేపీకి మంచి మెజారిటీ రావడంతో సీఎంగా విష్ణు దియో ఎంపిక
ఛత్తీస్‌గఢ్‌లోని ప్రముఖ గిరిజన నేత విష్ణు దియో సాయిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ ఎంపిక చేసింది. ఆదివారం 54 మంది ఎమ్మెల్యేలతో జరిగిన పార్టీ శాసనసభా పక్ష నేత సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రానికి ఓ గిరిజన నేతను సీఎం చేయాలన్న మోదీ సంకల్పం ప్రకారం సీఎం ఎంపిక జరిగిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 

వివాదరహితుడిగా పేరున్న విష్ణుదియో సాయి, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2020-22 మధ్యకాలంలో రాష్ట్ర పార్టీ ప్రెసిడెంట్‌గా సేవలందించారు. పార్టీ నిర్వహణపై మంచి పట్టున్న వ్యక్తిగా పేరుపొందారు. బీజేపీ నేషనల్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్‌గా కూడా పనిచేసిన ఆయనను ప్రధాని నరేంద్ర మోదీ 2014లో కేంద్ర ‌సహాయ మంత్రిగా నియమించారు. 

సీఎం అభ్యర్థిపై బీజేపీ దాదాపు వారం రోజుల పాటు తర్జనభర్జనలు పడింది. గిరిజన నేతను సీఎం చేయాలా లేక ఓబీసీ నేతకు ఈ అవకాశం ఇవ్వాలా అన్న విషయంలో పార్టీలో తీవ్ర చర్చ జరిగింది. మాజీ సీఎం రమణ్ సింగ్ అండదండలతో పాటూ ఆర్ఎస్ఎస్ మద్దతు కూడా ఉండటంతో చివరకు విష్ణు పేరు సీఎంగా ఖరారైంది. 

విష్ణు దియో సాయిను సీఎం చేసే అవకాశం ఉందని ఎన్నికల సమయంలోనే హోం మంత్రి అమిత్ షా సంకేతాలిచ్చారు. కుంకురి నియోజకవర్గంలో ప్రచారం సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ..‘‘మీరు సాయిని ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే మేము ఆయనను ఇంకా పెద్ద వ్యక్తిని చేస్తాం’’ అని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో గిరిజనులకు బీజేపీ ఫేవరెట్‌గా మారింది. మునుపెన్నడూ చూడని రీతిలో.. గిరిజన ప్రాబల్యం అధికంగా ఉన్న సుర్గుజా ప్రాంతంలో ఉన్న 14 సీట్లు, బస్తర్ ప్రాంతంలోని 12 సీట్లు గెలుచుకుంది. దీంతో, విష్ణు దియో సాయికి సీఎం కుర్చీ దక్కింది.
Vishnu Deo Sai
Chhattisgarh
BJP
Narendra Modi
Amit Shah

More Telugu News